కమలం కంట్లో పీకే నలుసు
posted on Mar 28, 2021 @ 1:05PM
కంట్లో నలుసు, పంటికింద రాయి, కాల్లో ముల్లు సామెత ఏదైనా, బీజేపీ, జనసేన మధ్య సాగుతున్న కీచులాట బంధానికి, రెండు పార్టీల మధ్య నలుగుతున్న కయ్యాలమారి కాపురానికి చక్కగా అతికినట్టు సరిపోతాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో, అటు తిరుపతి లోక్ సభ స్థానానికి, ఇటు నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతన్న సమయంలో, రెండు పార్టీల నాయకులు ఒకరి నిజాయతీ, చిత్తశుద్ధిపై ఇంకొకరు అనుమానాలు వ్యక్తం చేయడం, మర్మగర్భ వ్యాఖ్యలు, విమర్శలు చేసుకోవడం ఒకెత్తు అనుకుంటే, ఇప్పడు ఆ దశను దాటి ఇప్పుడు ప్రత్యక్ష ఆరోపణలకు దిగుతున్నారు.
ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ చపలచిత్త నిర్ణయాలు తమ కొంప ముంచుతున్నాయని ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆఖరి క్షణంలో తెరాస అభ్యర్ధి, వాణీ దేవికి మద్దతు ప్రకటించడం కమల నాధులకు అసలు మింగుడు పడడం లేదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్’కు పెద్దగా పట్టు లేకపోయినా, ఆఖరి క్షణంలో ఆయన తెరాసకు మద్దతు ప్రకటించడంతో తటస్థులు, అంతవరకూ బీజేపీ అభ్యర్ధి రామచంద్ర రావు గెలుపు పై విశ్వాసం ఉంచి, ఆయనకు ఓటు వేయడానికి సిద్దమైన వారు, మనసు మార్చుకోవడం జరిగిందని, బీజేపీ నాయకులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. అందుకే,నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో ఆఖరి క్షణంకు ఆయన నిర్ణయం కోసం వేచి చూసి, చివరకు భంగపడడం కంటే అయన కంటే ముందే కటీఫ్ చెప్పేస్తే, గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా పార్టీ పరవు అన్నా మిగులుతుందని కొందరు నేతలు పార్టీ అధినాయకత్వానికి సూచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
అయితే, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం పవన్ తో పొత్తు విషయంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా కొందరు నాయకులు పవన్’తో పొత్తు కటీఫ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని అంటున్నారు. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఉభయ పార్టీల మధ్య ఒక స్పష్టమైన అవగాహాన కుదిరినందున, ఈ దశలో పొత్తును తమంతట తాముగా తుంచుకోవడం మంచి కాదని, కమల దళంలోని ఒక వర్గం గట్టిగా వాదిస్తోంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా పవన్’తో పొత్తు కొనసాగించడం ఉత్తమమని, అలాగే, పవన్ కళ్యాణ్ ఇప్పటికే బహిరంగంగా బీజేపీ అభ్యర్ధి, రత్న ప్రభకు మద్దతు ప్రకటించి నందున, అదే యథాతథ స్థితిని కొనసాగించడం మంచిదని కొందరు నేతలు అభిప్రాయ పడుతున్నారు.
అయితే ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ఒక చోట స్నేహం, మరో చోట వైరం అంటే, బెంగాల్లో పొత్తు,కేరళలో కయ్యం అన్నట్లుగా సాగుతున్న కాంగ్రెస్, కమ్యూనిస్ట్ శతృ, మిత్ర బంధంలా నవ్వులు పాలవుతామని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ సందర్భంగా, గతంలో పార్టీ నేతగా ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాయిన్ చేసిన, గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ’ స్లోగన్ను గుర్తు చేస్తున్నారు. అలాగే మంచో చెడో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒంటరిగా పోవడమే ఉత్తమమని ఉభయ రాష్ట్రాలలోని మెజారిటీ వర్గం అభిప్రాయ పడుతోంది. తెలుగు రాష్రాయ లలో పొత్తులు కలిసి రాలేదని, సుదీర్ఘ కాలం పాటు తెలుగు దేశంతో పొత్తు సాగించడం వలన తోక పార్టీ అన్న ముద్ర తప్ప ఇంకేమి మిగల లేదని పార్టీ సీనియర్ నేతలు సైతం ఒంటరి పోరువైపే మొగ్గు చూపుతున్నారు. సిద్ధాంత భావసారుప్యత లేని పార్టీలతో, ముఖ్యంగా ఎటు గాలి వేస్తే అటు పోయే పవనుడితో పొత్తు దీర్ఘకాలంగానే కాదు తాత్కాలికంగా వేస్ట్ అని సీనియర్ నేతలు తేల్చేస్తున్నారు.