తిరిగి టీఆర్ఎస్ లోకి కొండా?
posted on Mar 28, 2021 @ 1:05PM
తెలంగాణ రాష్ట్ర సమితీలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తప్పుకుని కేటీఆర్ కు ఆ బాధ్యతలు అప్పగిస్తారని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం కూడా ఖరారైందని చర్చ సాగింది. టీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కొత్త వారికి ఇస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని కూడా కొందరు చెప్పారు. ఇటీవల కాలంలో ఈటల రాజేందర్ బాంబులు పేల్చుతున్నారు. టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆయన కామెంట్లు ఉంటున్నారు. ఈటల కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం కూడా ఉంది. అదే సమయంలో ఈటలను కూల్ చేసేందుకు కేసీఆర్ ఆయనకు కీలక బాధ్యతలు ఇవ్వలాని చూస్తున్నారని కూడా టీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ జరిగింది.
టీఆర్ఎస్ లో ఆసక్తికర పరిణామాలు జరుగుతుండగానే.. టీఆర్ఎస్ మాజీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావుపై ఆయన సంచలన కామెంట్లు చేశారు. ఈటల రాజేందర్, హరీశ్ రావు తనకు ఇష్టమైన నేతలు అన్నారు కొండా. తక్కువ మాట్లాడతారు... ఎక్కువ వింటారని చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్ తప్పుకుని టీఆర్ఎస్ నాయకత్వాన్ని హరీశ్ లేదా ఈటలకు ఇస్తే మళ్ళీ టీఆర్ఎస్‌లో చేరతానన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డియ
ఈటలను కలిసి మాట్లాడాలనుకుంటున్నానని, అపాయింట్‌మెంట్ కూడా అడిగానని కొండా చెప్పుకొచ్చారు. అయితే ఇంకా అవకాశం ఇవ్వలేదన్నారు. ఫ్లోన్ల ట్యాపింగ్ భయంతో టీఆర్ఎస్ పార్టీ వాళ్లు తనతో మాట్లాడటానికి భయపడతున్నారన్నారు. ఈటల గొప్ప వామపక్షవాది అని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌పై ఈటల ఒక్కోసారి అలుగుతారు.. మరోసారి దోస్తీ చేస్తున్నారని సుతిమెత్తగా చురకలు వేశారు. అది కనుక్కుందామనే... ఆయనతో భేటీకి ప్లాన్ చేసినట్టు చెప్పారు. నిజంగా బయటకు వచ్చేది ఉంటే వచ్చేయండని చెబుతానన్నారు. ఇంకోపక్క బీసీ, ముదిరాజ్‌లతో పార్టీ పెట్టమని.. ఈటలను కేసీఆర్ ప్రోత్సహించే అవకాశం ఉందన్నారు. ఈటల సొంత పార్టీ ఏర్పాటు చేస్తే గొప్ప నాయకుడు అవుతాడని కొండా జోస్యం చెప్పారు. ఆలస్యం చేస్తే.. సీఎం కేసీఆర్‌తో కలసి ఈటల కూడా డ్రామాలు ఆడుతున్నారనుకోవాల్సి వస్తోందన్నారు.