గ్రామ వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలే! టీడీపీ చెప్పేదే నిజమన్న మంత్రి
posted on Jan 7, 2021 @ 11:00AM
ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన సచివాలయ వ్యవస్థగా గురించి జగన్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటోంది. మహాత్మ గాంధీ కలను సాకారం చేశామని ప్రచారం చేసుకుంటోంది. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించామని , వాలంటీర్లు వారియర్లుగా పని చేస్తున్నారంటూ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జాతీయ స్థాయిలో ప్రకటనలు ఇచ్చుకుంటోంది. విపక్షాలు మాత్రం వాళ్లు వారియర్లు కాదు వైసీపీ కొరియర్లని విమర్శలు చేస్తున్నాయి. గ్రామ సచివాలయాల పేరుతో తమ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ నిధులు దోచి పెడుతున్నాపని మండిపడుతున్నాయి. ప్రభుత్వ అధికారులతో సంబంధం లేకుండా గ్రామ వాలంటీర్లు చేసే పనులేంటో చెప్పాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ. అయితే తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రే అసలు నిజాన్ని అంగీకరించారు. టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తున్నది నిజమేనని అంగీకరించిన ఆయన.. వైసీపీ కార్యకర్తలనే గ్రామ వాలంటీర్లుగా నియమించామని ఓపెన్ గానే చెప్పేశారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ధర్మాన.. కార్యకర్తలకు అండగా ఉంటామని చెబుతూ .. గ్రామ వాలంటీర్ల విషయంలో జరిగిన అసలు నిజాన్ని అంగీకరించారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలను నియమించామని తెలిపారు. తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలెవరు అసంతృప్తికి గురి కావొద్దని, భవిష్యత్తులో మరింత మందికి ఉపాధి కల్పిస్తామని కూడా ధర్మాన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ విజయ్‌సాయిరెడ్డి కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. కార్యకర్తలకు ప్రభుత్వంలో అవకాశం కల్పిస్తామని.. ఆరు నెలల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్రంగా స్పందిస్తోంది. గ్రామ వాలంటీర్ల విషయంలో ముందు నుంచి తాము చెబుతున్నదే నిజమైందని ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రే తమ ఆరోపణలు నిజమని అంగీకరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. వాలంటీర్లు పూర్తిగా వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని, ఆ పార్టీ వాళ్లకే పనులు చేసి పెడుతున్నారని మండిపడుతున్నారు. వైసీపీ కార్యకర్తల కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తామని విజయసాయి చెప్పడంపైనా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సర్కార్ ప్రజలందరి కోసం ఉందా లేక లేక ఓ వర్గం కోసమే పని చేస్తుందో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.