చివరికి పవన్ కళ్యాణ్ కూడా దూరమయ్యాడు
posted on Feb 27, 2014 @ 2:11PM
ఈరోజు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ మొట్ట మొదటి సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమయింది. దానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితరులు అందరూ వచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగానయినా సోదరుడు చిరంజీవిని పలుకరించే ప్రయత్నం చేయలేదు. ఆయన అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయారు. అందరితో ఎంతో ఆత్మీయంగా మెలిగే పవన్ కళ్యాణ్ ఆయనను కనీసం పలుకరించేందుకు కూడా ఇష్టపడకపోవడం గమనిస్తే, ఆయన చివరికి కుటుంబ సభ్యులని కూడా ఎంతగా దూరం చేసుకొన్నారో అర్ధమవుతోంది. అంతకంటే ముఖ్యంగా ఆయన సగటు తెలుగు ప్రజల అభిమానాన్ని ఎంతగా పోగొట్టుకొన్నారో ఈ సంఘటన తెలియజేస్తోంది.
మూడు రోజుల క్రితం ఆయనే స్వయంగా “కాంగ్రెస్ అధిష్టానం నాకు ఏ భాద్యత అప్పగించినా సవినయంగా స్వీకరిస్తానని” చెప్పారు. కానీ మళ్ళీ ఆయనే ఈరోజు “నేను ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్నడూ అర్రులు చాచలేదు. మీడియానే ఈ విషయంలో అనవసరమయిన రాద్దాంతం చేసింది,” అని ఆయన చెప్పే మాటలు వినేందుకు మనస్కరించకే బహుశః పవన్ కళ్యాణ్ అక్కడి నుండి నిష్క్రమించారనుకోవచ్చు.
ఈవిధంగా చిరంజీవి కాక మరే రాజకీయ నాయకుడు ప్రవర్తించినా ప్రజలు కూడా అంతగా పట్టించుకొనేవారు కాదు. కానీ, ఇంతకాలంగా వారు గుండెల్లో పెట్టి పూజించుకొన్న తమ మెగా దేవుడే ఒక సామాన్య రాజకీయ నాయకుడిలా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదే అభిప్రాయం ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఈరోజు వెలిబుచ్చారనుకోవచ్చును. ఇదంతా చూసి బహుశః ఆయన మారే ప్రయత్నం చేస్తే చేయవచ్చు, చేయకపోవచ్చును. కానీ ఈ రెండేళ్ళ రాజకీయ జీవితంలో ఆయన బయటపెట్టుకొన్న తన అసలు రూపం ప్రజలెన్నటికీ మరిచిపోలేరు.