మెగా ప్రస్తానం
posted on Feb 27, 2014 @ 2:07PM
మెగా స్టార్ చిరంజీవి సినీ పరిశ్రమ నుండి బయటకి వచ్చి రాజకీయాలలోకి అడుగుపెట్టిన తరువాత పరిశ్రమలో ఆయనకి ఎంత వ్యతిరేఖత ఉందో బయటపడింది. డా.రాజశేఖర్ రెడ్డి దంపతులు, మోహన్ బాబు, అనేక మంది చిన్ననిర్మాతలు ఆయనను ద్వేషించారు. ఇక యువ హీరో ఉదయ కిరణ్ సినీ జీవితం దెబ్బతినడంతో అతను అర్ధాంతరంగా జీవితానికి ముగింపు పలికి వెళ్ళిపోయినప్పుడు, చాలా మంది ఆయననే వేలెత్తి చూపారు.
రాజకీయాలలోకి వచ్చిన తరువాత కూడా ఆయన విమర్శలు మూటగట్టుకొంటూనే ఉన్నారు. ఆయన ప్రజారాజ్యం స్థాపించినపుడు లక్షలాది ఆయన అభిమానులు, ప్రజలు ఆయన వంక ఎంతో ఆశగా ఎదురు చూసారు. హనుమంతుడిలా అన్నకు జీవితాంతం తోడుంటానని చెప్పి పార్టీలో చేరిన ఆయన వీరాభిమాని పోసాని కృష్ణ మురళి, కొద్ది రోజులలోనే ఆయన తీరుని అసహ్యించుకొంటూ ఆయనకు దూరం జరిగారు. ఆ తరువాత ఆయనను నమ్ముకొని వచ్చిన రాజకీయనాయకులు, అభిమానుల ఆశలన్నీ అడియాసలు చేస్తూ ఎన్నికలు కూడా మొదలవక మునుపే ఆయన పార్టీ పతనం ప్రారంభమయి, ఫలితాలు వెలువడిన కొద్ది నెలలకే ప్రజారాజ్యం ప్రస్థానం ముగిసిపోయింది.
కేంద్రమంత్రి పదవి కోసం తనను నమ్ముకొన్న ప్రజలను, పార్టీ కార్యకర్తలను నట్టేట ముంచి ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపి వేసినప్పటి నుండి క్రమంగా ప్రజలు, అభిమానులు, చివరికి స్వంత సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా దూరం కాసాగారు. తెలుగు ప్రజల అత్మాభిమానానికి, గౌరవానికి నిలువెత్తు ప్రతీకగా నిలుస్తారని అందరూ భావిస్తే, ఆయన సోనియాగాంధీ ముందు ‘జీ హుజూర్!’ అంటూ ఆయన చేతులు కట్టుకొని నిలబడటం తెలుగు ప్రజలకు, ముఖ్యంగా ఆయన అభిమానులకు చాలా బాధ కలిగించింది.
తెలంగాణా ఉద్యమాలు పతాక స్థాయిలో జరుగుతున్నపుడు ఆయన తాను సమైక్యవాదినని ప్రకటించుకొని తెలంగాణా ప్రజలనూ దూరంచేసుకొన్నారు. అయితే ఆయన సమైక్య వైఖరివల్ల కనీసం సీమాంద్రలో కూడా మంచి పేరు సంపాదించుకోలేకపోయారు. కారణం ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూల వైఖరి అవలంబించడమే. ఆ తరువాత రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరుతో ఆయన మూడు దశాబ్దాలు శ్రమించి సంపాదించుకొన్న పేరు ప్రతిష్టలను చేజేతులా పాడుచేసుకొన్నారు. సీమాంధ్ర ప్రజలు రాష్ట్రవిభజన జరిగినందుకు ఎంతో బాధపడుతుంటే, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడటం చూసి ప్రజలు తీవ్ర ఆగ్రహం చెందారు. అయితే, వ్రతం చెడినా ఫలం దక్కనట్లయింది ఆయన పని. ముఖ్యమంత్రి పదవి ఆశించి అటు అధిష్టానం వద్ద భంగపడ్డారు. ఇటు ప్రజల ముందు కూడా చులకనయిపోయారు.