సీఐ అంజు యాదవ్ ఇమేజ్ పెంచేసిన పవన్?!
posted on Jul 17, 2023 @ 3:09PM
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ అంజు యాదవ్ వర్సెస్ జనసేన అన్నట్లుగా ఏపీలో ఒక వివాదం నడుస్తున్నది. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శితో సీఐ దురుసుగా ప్రవర్తించడం, ఆయనపై సీఐ చేయిచేసుకోవడంతో జనసేన సీరియస్ అయింది. జనసేన పార్టీ కార్యకర్తల నుండి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరకూ ఈ విషయంపై సీరియస్ అవుతున్నారు.
జనసేన జిల్లా కార్యదర్శి సాయిపై చేయి చేసుకోవడం సహా ఆమె పాత వీడియోలను వైరల్ చేసిన జనసేన కార్యకర్తలు ఆమెపై చర్య తీసుకోవాలని కోరారు. గతంలో ఆమె అమాయకులను ఇబ్బంది పెట్టడం, తొడకొట్టి సవాళ్లు విసిరడం వంటి పలు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆమెకు పోలీస్ శాఖ చార్జ్ మెమో జారీచేశారు. జనసేన నేతపై చేయిచేసుకున్న ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీ విచారణ నిర్వహించి.. డీజీపీకి నివేదిక కూడా సమర్పించారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ ఇందుకు సంబంధించి ప్రతివాదులైన అయిదుగురికి నోటీసులు జారీ చేసి ఈ నెల 27వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
మరోవైపు ఇదే ఘటనపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ అంజు యాదవ్ చేయి చేసుకుంటున్నా సహనంగా ఉన్న సాయిని పవన్ కల్యాణ్ అభినందించి.. సాయిలాంటి దృఢ సంకల్పం ఉన్నవారు జనసేనకు కావాలంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు, పవన్ తిరుపతికి వచ్చి సీఐ సంగతి తేలుస్తానంటూ ప్రకటించారు. అన్నట్లుగానే తిరుపతి వచ్చి ఫిర్యాదు కూడా చేశారు. అయితే అప్పటికే ఎస్పీ విచారణ పూర్తి చేసి డీజీపీకి నివేదిక కూడా ఇచ్చేసినా పవన్ మాత్రం ఐదుగురు జనసేన కార్యకర్తలతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సీఐపై ఫిర్యాదు చేశారు. జనసేన ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపుతున్న సమయంలో దుమారం రేగింది. వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు, వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మను దనహం చేశారు. ఇందుకు ప్రతిగా శ్రీకాళహస్తిలో గత బుధవారం జనసేన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపం సమీపంలో పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టె సాయి మహేష్ తో పాటు ఇతర నాయకులు సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు సిద్దమయ్యారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులు, జనసేన శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు వారి నుండి దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు. జనసేన నాయకులను బలవంతంగా టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమయంలోనే జనసేన నేత సాయి మహేష్ పై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకున్నారు. సరే ఆ ఘటనపై మానవహక్కుల కమిషన్, పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. వారి స్థాయిలో చేయాల్సింది చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా.. అసలు సీఐ అంజు యాదవ్ పై జనసేన కార్యకర్తలు, నేతలు ఇంకా పోరాటం చేయడం కరెక్టేనా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ ఘటనలో తిరుపతికి వెళ్లి మరీ ఫిర్యాదులు చేయడం అవసరమా? ఇది జనసేనాని స్థాయిని పెంచలేదు సరికదా, అంజు యాదవ్ ఇమేజ్ ను మాత్రం అమాంతంగా పెంచేసింది. జనసేన నేతలపై పోలీసులు ఎక్కడ దురుసుగా ప్రవర్తించినాపవన్ కళ్యాణ్ అక్కడకి వెళ్లి ఫిర్యాదులు చేస్తారా? అన్న ప్రశ్నలు పరిశీలకుల నుంచి వెలువడుతున్నాయి. ఒక సీఐకి పవన్ అనవసర ప్రాధాన్యత ఇచ్చారన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. జనసేన పార్టీ సీఐ అంజు యాదవ్ పై పోరాటం చేస్తున్నదా.. లేక ఆమె ఇమేజ్ పెంచుతున్నదా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే నిత్యం పార్టీ కార్యకర్తలు, పోలీసు వ్యవస్థ మధ్య ఇలాంటి వాతావరణమే ఉంటుంది.
అందునా ఇలాంటి కోపాన్ని అణుచుకోలేని సీఐలు ఉన్న ప్రాంతాలలో ఇది ఎప్పుడూ ఉండేదే. అంజూ యాదవ్ జనసేన జనసేన నేత సాయి మహేష్ పై చేయి చేసుకోవడం ముమ్మాటికీ తప్పే. అందుకే పోలీస్ శాఖ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెపై చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు హెచ్ఆర్సీ కూడా స్పందించి వివరణ కోరింది. ఇలాంటి సమయంలో ఆ రెండు శాఖల వారికి కావాల్సిన సమాచారాన్ని జనసేన సమకూరిస్తే న్యాయం దక్కుతుంది. అందుకు భిన్నంగా స్వయంగా జనసేనాని పవన్ కల్యాణే ఆమెపై ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి తిరుపతికి రావడంతో అంజూ యాదవ్ కు ఒక సెలబ్రిటీ గుర్తింపు వచ్చేసింది. జనసేనానే స్వయంగా ఆమెకు ఎక్కడ లేని పబ్లిసిటీ ఇచ్చి ఆమె స్థాయిని పెంచేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.