ఎస్సీ, ఎస్టీ ఓట్ల కోసం తెలంగాణ పార్టీల కొట్లాట!
posted on Jul 17, 2023 8:57AM
తెలంగాణలో ఎన్నికల సమయం వచ్చేసింది. అక్టోబర్ లేదా నవంబర్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుండి సమాచారం కూడా వచ్చేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ప్రీ ఎలక్షన్ ఏర్పాట్లు కూడా ప్రభుత్వ శాఖలు మొదలు పెట్టాయి. దీంతో రాజకీయ పార్టీలు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రజల మధ్యకు వెళ్లి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కొత్త కొత్త ప్రభుత్వ పథకాలు, పెండింగ్ హామీలను నెరవేర్చే పని చేస్తుంటే.. ప్రతి పక్షాలు నెరవేర్చని హామీలను ఎండగడుతూ కొత్త కొత్త హామీలను ఇస్తూ ఓటర్లను ఆకర్షించే పని చేస్తున్నాయి. అయితే, జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులను లోతుగా చూస్తే తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.
ఇక్కడ ప్రధాన పార్టీలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముందుగా బీఆర్ఎస్ ని చూస్తే.. సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడేనని హామీ ఇచ్చారు. కానీ, తీరా రాష్ట్రం సిద్దించి, పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం కుర్చీ ఎక్కారు. అలాగే దళితులకు కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి దాన్నీ వదిలేశారు. దీంతో దళితులలో ఈ అసంతృప్తి కనిపిస్తుంది. దాన్ని మాఫీ చేసి దళితులను ఆకట్టుకునేందుకు దళిత బంధు పేరుతో భారీ మొత్తంలో ఆర్ధిక సాయం అందించేందుకు కేసీఆర్ వ్యూహరచన చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో అక్కడ అధిక శాతం ఉన్న దళితులను తన వైపుకు తిప్పుకొనేందుకు మొదలు పెట్టిన ఈ దళిత బంధు అప్పటి నుండి విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ వస్తున్నారు. దీంతో పాటు కొత్త తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా కొత్త పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అంతేకాదు 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రకాష్ అంబేద్కర్ తో ప్రారంభించారు.
మరో వైపు ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు కూడా బీఆర్ఎస్ రకరకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణలో పోరాటాలు సాగుతున్న పోడు భూముల సమస్యకు ఈ మధ్యనే కేసీఆర్ సర్కార్ చెక్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పెద్ద సంబురంగా జరిపించింది. పోడు భూముల సమస్య తొలగిందంటే అది కేసీఆర్ ఒక్కడి వల్లనే సాధ్యమైందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎస్టీల చెవులలో రీ సౌండ్ వినిపించేలా ఊరూరా చాటారు. ఈ పోడు భూములలో దాదాపు 90 శాతంగా పైగా భూమి ఎస్టీలకు సంబంధించినదే అంటే కేసీఆర్ ఏ స్థాయిలో వ్యూహ రచన చేసారో అర్ధం చేసుకోవచ్చు. దీంతో పాటు ఎస్టీలకు సంబంధించి ఐటీడీఏల పరిధిలో గిరిజనులకు ఉపాధి కలిగించేలా రకరకాల పేర్లతో యూనిట్లు మంజూరు చేస్తున్నారు.
ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే గతంలో కేసీఆర్ ఉద్యమం సమయంలో ఏ హామీలు అయితే ఇచ్చి అమలు చేయలేదో కాంగ్రెస్ వాటినే ఫోకస్ చేసి ప్రజలలోకి వెళ్లేలా చేస్తుంది. కేసీఆర్ చెప్పిన దళిత సీఎం ఛాన్స్ కాంగ్రెస్ లో మాత్రమే ఉందనేలా కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది. కాంగ్రెస్ లో దళిత నేత భట్టి విక్రమార్క, ఎస్టీ మహిళా నేత సీతక్కల పేర్లు ఇప్పటికే కాంగ్రెస్ దిగ్విజయంగా ఫోకస్ లోకి తెచ్చి పెట్టింది. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి కేటాయిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. కేసీఆర్ దళిత బంధు ఇస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్టీలకు కూడా భారీ ఆర్ధిక సాయం అందించే పథకం తెస్తామని చెప్తున్నారు. ఇలా మొత్తంగా చూస్తే ఒక వైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ ఓట్లపైనే కన్నేసి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయి. మరి తెలంగాణ ఎస్సీ, ఎస్టీలు ఈసారి ఎవరిని నమ్మి ఓట్లేస్తారో చూడాలి.