Read more!

వైసీపీ సీన్ రివర్స్.. పంచుమర్తి విజయం జగన్ భవిష్యత్ పతనానికి దర్పణం?

వైసీపీకి సీన్ రివర్స్ అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉగాదికి ముందు రోజు గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సంపూర్ణ పరాజయం, ఉగాది మరునాడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవం. అయితే ఓటమిని హుందాగా స్వీకరించే తత్వం లేని వైసీపీ నాయకులు అసలు గ్యాడ్యుయేట్ లు తమ ఓటర్లే కాదని డిజోన్ చేసుకున్నారు.

సమాజంలో వారో చిన్న భాగం మాత్రమేననీ, తమ ఓటర్లే వేరే ఉన్నారనీ గంభీర ప్రసంగాలు చేశారు.  గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడుకు మూడు స్థానాలలోనూ పరాజయం పాలైన తరువాత వైసీపీ సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకు వచ్చి గ్యాడ్యుయేట్లు తమ ఓటర్లు కాదని చెప్పారు. వారెవరూ తమ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కాదని నిస్సంకోచంగా చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ కు పాల్పడితే.. చంద్రబాబు వారిని ప్రలోభాలకు గురి చేసి తమ అభ్యర్థి ఓటమికి కారకుడయ్యారే తప్ప తాము ఓడిపోలేదని కొత్త భాష్యం చెప్పుకున్నారు.

పోనీ క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా అంటే సజ్జల గారు దానికి కూడా తనదైన ప్రత్యేక శైలిలో  ఇదేమీ ఉద్యోగం కాదు తప్పు చేశారని తేలగానే చర్యలు తీసుకోవడానికి ఇది రాజకీయం.. సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని అంటున్నారు.  ఇంతకీ సజ్జలగారి భాష్యం ఏమిటంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో తమ పార్టీ ఓ స్థానాన్ని కోల్పోవడానికి తమ ఓటమి కారణం కాదట.. చంద్రబాబు తమను ఓడించారు అని చెబుతున్నారు. అంతే కాదు క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే పాటి ధైర్యం కూడా లేని దయనీయ పరిస్థితికి వైసీపీ దిగజారిందని సజ్జల మాటలు తేటతెల్లం చేస్తున్నాయి.

నిన్న మొన్నటి దాకా ఎమ్మెల్యేలకు పూచిక పుల్ల పాటి విలువ కూడా ఇవ్వని జగన్ ఇప్పుడు వారికి ఎక్కడ ఆగ్రహం వస్తుందో అన్న భయంతో వణికిపోతున్న పరిస్థితికి ఇది అద్దం పడుతోందని చెబుతున్నారు. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే.. మొదటికే మోసం వస్తుందన్న భయం వారిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిపైనే సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్య తీసుకుంటే.. ఉప ఎన్నిక ఎదుర్కొనవలసిన అనివార్య పరిస్థితి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే.. కోరి కొరివితో తలగోక్కున్నట్లే అవుతుందన్నది జగన్ భయంగా పరిశీలకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి పరాజయం పాలైతో ఉన్న కాస్త పాటి పరువూ గంగలో కలుస్తుందన్న బెరుకు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.

 అసలు పార్టీపై, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలపై జగన్ పట్టు సడలడం ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసిన సమయంలోనే తేటతెల్లమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులలో అసమ్మతి, ఆగ్రహం ఒక్క సారిగా భగ్గుమన్నాయి. బతిమాలో, బామాలో ఎలాగోలా ఆ పరిస్థితిని నుంచి బయటపడిన జగన్ ఇప్పుడు ఈ ఓటముల తరువాత ఇప్పటి వరకూ తాను ఎవరిపైనైతే పెత్తనం చెలాయంచారో వారి అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తామని భావించిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక స్థానంలో ఎదురైన పరాజయంపై వైసీపీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ  పరాభవం పార్టీ శ్రేణుల్లో కూడా నిరాశను నింపేసిందని అంటున్నారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేలే అధినేత ఆదేశాన్ని ధిక్కరించడం, క్యాంపులు ఏర్పాటు చేసి, ఒకటికి నాలుగు సార్లు మాక్ ఓటింగ్ చేయించినా క్రాస్ ఓటింగ్ జరగడం వైసీపీ అధినేత జీర్ణించుకోలేకపోతున్నారు.  ఇక ముందున్నది అంతా గడ్డుకాలమే అన్న నిర్ణయానికి వైసీపీ అధినాయత్వం వచ్చేసిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.