భారత్ తో కాళ్లబేరానికి పాకిస్థాన్.. ఎందుకంటే?
posted on Jan 25, 2023 @ 1:13PM
భారత్‌తో మూడు ప్రత్యక్ష యుద్ధాలు, అనే పరోక్ష యుద్ధాలు చేసిన పాకిస్థాన్ ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తోంది. బుద్ధి వచ్చిందని, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని ఇటీవల పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహజా షరీఫ్ ఓ ప్రకటన చేశారు. భారత్ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆయన ప్రకటనలో నిస్సహాయత ఉంది. అదినిజం. అలాగే కపటత్వమూ ఉంది. అదీ వాస్తవమే. కాశ్మీర్‌తో సహా వివిధ కీలక సమస్యల మీద ‘నిజాయతీ’గా చర్చలు జరిపి, వీటికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని షరీఫ్ అంటున్నారు.
అదే పాకిస్థాన్ లోని కపటత్వాన్ని ప్రపంచానికి మరో సారి ఎత్తి చూపింది. కాశ్మీర్ మీద చర్చించడానికి ఏమీ లేదు. కాశ్మీర్ భారత్‌లోని భాగమని, ఆర్టికల్ 370 రద్దుతో ఇది మరింత ధృవపడింది. కాశ్మీర్ మొదటి నుంచి భారతదేశంలో అంతర్భాగమనీ ఆర్టికల్ 370 రద్దు కూడా భారతదేశ అంతరంగిక వ్యవహారమని పాక్ ప్రపకటన శాంతి చర్చల ప్రతిపాదన ప్రకటనలో అంగీకరించి ఉంటే.. ఆ దేశంలో మార్పు వచ్చిందనీ, వస్తోందనీ ఒకింత విశ్వాసం కలిగేది. కానీ ఆయనా పని చేయలేదు. పాకిస్థాన్ విషయంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవలసిన అంశాలు ఉన్నాయన్నపాత పాటనే ఆయన పాడారు. అన్నిటికీ మించి భారత్ లో అశాంతి నింపడం, శాంతి భద్రతల సమస్య సృష్టించడం, మారణహోమం సృష్టించి అస్థిరత నెలకొల్పడం లక్ష్యంగా పాక్ భూభాగంలో శిక్షణ పొంది దొంగచాటుగా సరిహద్దులు దాటి వస్తున్న ఉగ్ర చొరబాట్ల గురించి ఆయన శాంతి చర్చల ప్రతిపాదన ప్రకటనలో ప్రస్తావించలేదు.
ఎందుకంటే వాస్తవంగా ఈ విషయాలేవీ ఆయన చేతుల్లో లేవు. ఆయన నియంత్రించలేరు. కాశ్మీర్ సమస్యను రావణ కాష్టం లాగా మార్చడంపైనా అక్కడి సైనికాధికారుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాశ్మీర్ కారణంగానే దేశంలో వారి పెత్తనం కొనసాగుతోంది. అందుకే భారత్ పాక్ ప్రతిపాదనకు స్పందించలేదు. భారత్ తో చర్చలకు ప్రయత్నాలు చేయడం కంటే తమ అంతర్గత సమస్యలను పరిష్కరించు కోవడం మీద దృష్టి కేంద్రీకరించడం మేలని అన్యాపదేశంగానైనా పాక్ ప్రధానికి భారత్ విస్పష్టంగా చెప్పింది. భారత్ ఇప్పటికే పాకిస్థాన్‌తో చర్చలకు ససేమిరా అని తేల్చి చెప్పేసింది. అయితే పాక్ బేలగా భారత్ను బతిమలాడుకోవడానికి కారణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. గోధుమ పిండి కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
ఇదివరకటి మాదిరిగా యూరోపియన్ దేశాల నుంచి ఆ దేశానికి ఎగుమతులూ జరగడం లేదు. ఏవిధమైన సహాయమూ అందడం లేదు. అమెరికా నుంచి కూడా చాలా చాలా పరిమిత స్థాయిలోనే విదేశీ మారక నిల్వలు దాదాపు అడుగంటి పోయాయి. దీంతో ఇక రానున్నరోజులలో దిగుమతులు కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది. దేశంలో వ్యవసాయ రంగం కుదేలైపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 60 శాతం, అంతకు మించి పెరిగిపోయాయి.
చైనా, యు.ఏ.ఇ, సౌదీ అరేబియా వంటి మిత్ర దేశాలు పాకిస్థాను సహాయం చేయడానికి ముందుకు వచ్చినా తక్షణసమస్యల నుంచి గట్టెక్కే అవకాశం లేదు. ఆఫ్ఘనిస్థాన్ చెందిన తాలిబన్లతో పాకిస్థాన్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిని పోయాయి. ఈ పరిస్థితుల్లో పాక్ కు భారత్ సహకారమే దిక్కు. అందుకే పాకిస్థాన్ ఇంత బేలగా భారత్ తో శాంతి చర్చల కోసం పాకులాడుతోంది. బతిమలాడుకుంటోంది.