కాలం చెల్లిన బస్సు.. మాన్యుఫాక్చరింగ్ లోనూ లోపాలు!
posted on Oct 24, 2025 @ 10:09AM
కర్నూలు చిన్న టేకూరు వద్ద శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారు జామున ఘోర ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ బస్సు ఫిట్నెస్ గడువు, ఇన్సూరెన్స్ పాలసీ, టాక్స్ అన్నీ గత ఏడాదితో ముగిసిపోయాయి. అలాగే పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా ఎక్స్ఫైర్ అయినట్టు అధికారులు గుర్తించారు. గురువారం (అక్టోబర్ 23) రాత్రి మూసాపేట్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో డ్రైవర్, సబ్ డ్రైవర్, క్లీనర్ సహా 43 మంది ఉన్నారు.
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కూడా ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. అతివేగంతో వెడుతూ ముందు వెడుతున్న బైక్ ను ఢీకొనడం, ఆ వేగానికి బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించడమే కాకుండా, బైక్ బస్సు కిందకు వెళ్లిపోయి ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొనడమే ఈ ఘోరానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అంతే కాకుండా ప్రమాద తీవ్రతను, మంటల వ్యాప్తి వేగాన్ని అంచనా వేయడంలో విఫలమైన డ్రైవర్లు.. ప్రయాణీకులను అప్రమత్తం చేయడంలో ఆలస్యం చేశారని కూడా అధికారులు భావిస్తున్నారు. ఆ జాప్యం కారణంగానే పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు అగ్నికి ఆహుతయ్యారనీ, అలాగే ఈ ప్రమాదం తరువాత బస్సు డోర్ ఓపెన్ కాకపోవడం వల్ల కూడా ప్రాణనష్టం అధికంగా జరిగిందని అంటున్నారు.
అంతే కాకుండా అసలు బస్సు మాన్యుఫ్యాక్చరింగ్ లోనే లోపాలున్నాయని కర్నూలు రేంజ్ ఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. బస్సులు ప్రమాదాలకు గురైతే.. ప్రయాణికుల ప్రాణనష్టం తగ్గించేలా బస్సు నిర్మాణంలో మెటీరియల్ వాడటం లేదని చెప్పారు. బస్పులో ప్రికాషన్స్ కూడా లేవన్నారు.