విపక్షాల మోడీ టార్గెట్ గురి తప్పుతోందా?
posted on Nov 17, 2022 @ 12:45PM
2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి అన్నదే బీజేపీయేతర పార్టీల లక్ష్యం. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నుంచి మొదలు ఇప్పుడిప్పుడే జాతీయ రాజకీయాలలో తొలి అడుగు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు, బీజేపీ ప్రత్యర్ధి పార్టీల నాయకులందరిదీ అదే మాట. అదే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. అందుకోసమే కమ్యూనిస్టులు ముందు వెనుకలు చూసుకోకుండా పొత్తులకు సిద్ధమౌతున్నారు.
కమ్యూనిస్టులా వారెక్కడున్నారు అన్న కేసీఆర్ పంచన చేరడానికి కూడా వారు ఒక్క క్షణం వెనుకాడలేదు. ఇక మరాఠా యోధుడు శరద్ పవార్, బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ, ఆప్ అరవింద్ కేజ్రివాల్ ఎవరి శక్తి మేరకు వారు వారి వారి దారిలో నడుస్తూ మోడీ పరాజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఇందుకోసం ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నారు. మరోవంక, బీజీపే వ్యతిరేక పార్టీల నేతలు అందరికీ తానే తలలోని నాలుక అంటూ హడావుడి చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు అదే లక్ష్యంతో సొంత కుంపటి పెట్టుకుని బీహార్ లో పాద యాత్ర చేస్తున్నారు.
ఇక విషయానికి వస్తే 2024 సార్వత్రిక ఎన్నికలకు ఎంత లేదన్నా ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఆ సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్, హిమాచల్, తెలంగాణ సహా ఐదారు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలున్నాయి, ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గానో లేదా సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు లిట్మస్ టెస్టుగానూ అంతా భావిస్తున్నారు.
అందులోనూ ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముందు వరసలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలోనూ కూడా అధికారంలో ఉన్నది బీజేపీయే. ఈ రెండు రాష్ట్ర్రాలలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా, అడ్డుకోగలిగితే అప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలోమోడీ టార్గెట్ రీచ్ కావడంపై విపక్షాలు ఆశలు పెట్టుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించే స్థితిలో ప్రతిపక్ష పార్టీలున్నాయా? అంటే, పరిశీలకులు, సర్వేలూ కూడా పెదవి విరుస్తున్నాయి.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో మరో సారి బీజేపీ విజయం సునాయాసమేనని సర్వేలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్ లో వరుసగా ఆరుసార్లు అధికారాన్ని నిలబెటగ్టుకున్న బీజేపీపై తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటగికీ.. బీజేపీని నిలువరించి అక్కడ అధికారం దక్కించుకునే విషయంలో విపక్షాల అనైక్యతే అడ్డుగా నిలుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. అందుకే అక్కడ వరుసా ఏడో సారి కూడా కమలమే అధికార పగ్గాలను అందుకుంటుందని చెబుతున్నాయి.
ఒక సర్వే అయితే గుజరాత్ అసెంబ్లీలో ఎన్నికలలో బీజేపే అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాదు, గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. గత ఎన్నికలలో బీజేపీ, అతికష్టం మీద, మొత్తం 182 స్థానాలకు గానూ 99 స్థానాలు గెలుచుకుని పరవు నిలుపుకుంది. అయితే, ఈసారి 135 నుంచి 143 వరకు స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఆ ఒపీనియన్ పోల్ పేర్కొంది. కాంగ్రెస్‌కు 36 నుంచి 44 వరకు సీట్లు దక్కవచ్చని సర్వే అంచనా వేసింది. గుజరాత్ లో గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ బలంగా పుంజుకున్నప్పటికీ గెలుపునకు దూరంగా నిలిచిపోవడానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆ రాష్ట్రంలో పోటీ చేస్తున్న ఆప్ చీల్చడమేనని ఆత్మసాక్షి తాజా సర్వే పేర్కొంది.
అలాగే 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 37-45 సీట్లలో విజయం సాధించి మరో సారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు ఘంటాపథంగా చెప్పాయి. ముఖ్యంగా గుజరాత్ విషయాన్ని తీసుకుంటే అక్కడి పరిణామాలను విశ్లేషిస్తే ఆ రాష్ట్రంలో మరో సారి బీజేపీకి అధికారపగ్గాలు అందడానికి విపక్షాల అనైక్యతే కారణమని స్పష్టంగా అర్ధమౌతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. అయితే ఆ తరువాత గడచిన ఈ ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ స్వయం తప్పిదాలతో వెనుకబడింది.
పటేదార్ ఆందోళనతో పాపులర్ అయిన యువనేత, హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు. అలాగే పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లోనూ కాంగ్రెస్ ఓటుకు భారీగా గండి కొడుతుందని పరిశీలకులు అంటున్నారు. వరసగా ఆరు పర్యాయాలు అధికారంలో ఉన్న, బీజేపీకి సహజంగానే రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది, అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య చీలిపోయి బీజేపీ లబ్ధి పొందుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గుజరాత్ లో సాగితే కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రయోజనం ఉంటుందని స్థానిక నాయలు ఆశించారు.
అయితే, రాహుల్ యాత్ర రూట్ మ్యాప్ లో గుజరాత్’, హిమాచల ప్రదేశ్ రాష్ట్రాలను చేర్చలేదు. ఇది గుజరాత్,హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఆశలు వదులుకుందనే సంకేతాన్ని ఇచ్చింది. దీంతో, రాహుల్ యాత్ర వలన అంతో ఇంతో వస్తుందనుకున్న మైలేజి రాకపోగా, నెగటివ్ ప్రచారానికి అవకాశం ఇచ్చింది. పోటీకి ముందే పరాజయాన్ని అంగీకరించేసిదన్న చర్చకు తావిచ్చింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో ఆదరణ పెరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకుడు, అరవింద్ కేజ్రీవాల్ వారంలో రెండు సార్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మూడో స్థానానికి పరిమితమైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోనూ అదే పరిస్థితి, కని పిస్తోంది. అందుకే, బీజేపీ వ్యతిరేక పార్టీలు వేటికి అవిగా మోడీ టార్గెట్ నిర్దేశించుకుని 2024 ఎన్నిక సమరంలో దిగితే ఆ టార్గెట్ రీచ్ కావడం సాధ్యం కాదనే పరిశీలకులు అంటున్నారు. అనైక్యత వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి ముచ్చటగా మూడో సారి కూడా కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుతీరే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. అందుకే విపక్షాల మోడీ టార్గెట్ గురి తప్పిందని ఇప్పటి నుంచే విశ్లేషణలు వస్తున్నాయి.