ఔనంటే కాదనిలే.. కాదంటే ఔననిలే!..కేసీఆర్ తీరే వేరులే
posted on Nov 17, 2022 @ 11:50AM
ఏదో సినిమాలో ఇలాంటి పాట ఒకటి ఉంది. అది ఆ సినిమాలో ఏ సందర్భానికి సంబంధించిన పాట అన్నది పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీరు మాత్రం చెప్పింది చేయం.. చేసేది చెప్పం అన్నట్లుగానే ఉందన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కూడా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినా అప్పుడే తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి రగులుతోంది.
ఇందుకు కారణం ప్రతిపక్షాలు కాదు.. అధికారంలో ఉన్న పార్టీలే. కారణం ఏదైనా తెలంగాణలో అధకారంలో ఉన్న తెరాసలోనూ, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోనూ కూడా ఇహనో, ఇప్పుడో ఎన్నికల ప్రకటన వెలువడనుందా అన్నంత హడావుడి కనిపిస్తోంది. తెరాస సీఎం ఇప్పటి నుంచే ఎన్నికలలో ఎలా పని చేయాలన్న దిశానిర్దేశాన్ని పార్టీ శ్రేణులకు నిర్దేశిస్తున్నారు. ఫిరాయింపులపై అప్రమత్తం చేస్తున్నారు. పార్టీ నుంచి పక్క చూపులు చూస్తున్నవారెవరో తనకు తెలుసనీ, ఎవరేం చేస్తున్నారో, ఎవరెవరు ఎవరెవరి టచ్ లోకి వెళుతున్నారో సమాచార మంతా తన దగ్గరు ఉదని హెచ్చరిస్తున్నారు. ప్రలోభాలకు లొంగి రాజకీయ భవిష్యత్ పాడు చేసుకోవద్దని హితవూ చెబుతున్నారు. సిట్టింగులందరికీ టికెట్లిస్తానని హామీ ఇచ్చేసి నియోజకవర్గాలలో పని చేసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ముందస్తు ముచ్చటే లేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలని చెబుతున్నారు.
ఆయన చెబుతున్న మాటలకూ, చేస్తున్న పనులకూ సంబంధమే లేదు. ముందస్తు లేదంటూనే.. ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించేశారు. ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలన్నదానిపై కార్యాచరణ మొదలెట్టేశారు. గతంలో అంటే 2018లో ముందస్తుకు వెళ్లినప్పుడు కూడా ఆయన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వెళదాం అంటూ క్యాడర్ కు చెబుతూనే ఉరుము లేని పిడుగులా ఆరు నెలలకు ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల శంఖారావం పూరించేశారు. ఇప్పుడూ అదే చేస్తారని, అందుకే ముందస్తు ముచ్చట లేదంటూనే.. ఎన్నికల సన్నాహాలు చేసేస్తున్నారని పార్టీ శ్రేణులే భావిస్తున్నపరిస్థితి. అయితే రాజకీయ వర్గాలలో మాత్రం కేసీఆర్ ముందస్తు లేదంటే ఉందనే అర్ధమని ఇందుకు 2018 ముందస్తు ఎన్నికలే నిదర్శనమనీ అంటున్నారు.
సంటిమెంట్లను విపరీతంగా ఫాలో అయ్యే కేసీఆర్ కలిసి వచ్చిన ముందస్తును కాదని షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లే చాన్సే లేదంటున్నారు విశ్లేషకులు. 2018 లో కూడా ముందస్తుగానే ఎన్నికల నగారా మోగించిన కేసీఆర్ అప్పట్లో ఆరు నెలలు ముందుగా ఎన్నికలు జరిగితే అవి ముందస్తు ఎందుకౌతాయని ప్రశ్నించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ గడువుకు ఆరు నెలలు ముందు ఎన్నికలు నిర్వహించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘమే చెబుతుంటే.. అందుకే షెడ్యూల్ కంటే ఆరు నెలలు ముందుగా ప్రభుత్వం ప్రజాతీర్పు కోరాలనుకోవడం ముందస్తుకు వెళ్లడం అవ్వదని ఆయన అప్పట్లో చెప్పారు. ఇప్పుడూ అదే చెప్పే అవకాశం ఉందంటున్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అని ఇటీవలి కార్యవర్గ సమావేశంలో ఆయన ఘంటా పదంగా చెప్పినా అదే ప్రసంగంలో ముందస్తు సంకేతాలు కూడా ఇచ్చారని వివరిస్తున్నారు.
ఆయన ఎన్నికలకు పది నెలల సమయం మాత్రమే ఉంది అంటూ కార్యవర్గ సమావేశంలో కేడర్ ను అప్రమత్తం చేశారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు అంటే వచ్చే ఏడాది డిసెంబర్ లో జరగాల్సి ఉంది. అంటే తక్కువలో తక్కువ పదమూడు నెలల సమయం ఉంది. కానీ కేసీఆర్ పది నెలలలోనే ఎన్నికలు అంటున్నారు. అంటే ఆయన ముందస్తుకు ప్రిపేర్ అయిపోవడమే కాకుండా క్యాడర్ ను కూడా అందుకు సంసిద్ధం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించేశారనే అర్ధమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక వచ్చే నెల నుంచీ కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతగా ఆయన రాజకీయ పరిధి పెరిగిపోతుంది. జాతీయ పార్టీ అధినేతగా కేసీఆర్ ఒక్క తెలంగాణే కాకుండా దేశంలో తక్కువలో తక్కువ మరో ఐదారు రాష్ట్రాలపై కేంద్రీకృతం చేయాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి వచ్చే నెల మొదటి వారంలో రెండు విడతలుగా జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రభావం చూపాలని ఆయన బలంగా నిర్ణయించుకున్నట్లు తెరాస వర్గాలే చెబుతున్నాయి. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి వాఘేలా వంటి వారి సహకారంతో అక్కడ కనీసం కొన్ని స్థానాలలోనైనా బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలోగా బీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం అనుమతి రాకుంటే గుజరాత్ లో తెలుగువారు అధికంగా ఉండే సూరత్ ప్రాంతంలోని అన్ని స్థానాలలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టి అయినా సత్తా చాటాలని కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని చెబుతున్నారు. ఇక ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా చాటాలంటే అంతకంటే ముందుగా ఆయన ఇంట గెలవాల్సి ఉంటుంది. తెలంగాణలో తెరాస ను ముచ్చటగా మూడో సారి అధికారంలోకి తీసుకువచ్చి అప్పడు రచ్చ గెలవాలని ఆయన భావిస్తున్నారు.
వచ్చే నెలలో బీఆర్ఎస్ కు గుర్తింపు వస్తే ఇక టీఆర్ఎస్ ఉండదు, బీఆర్ఎస్ మాత్రమే ఉనికిలో ఉంటుంది. అప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చి..జాతీయ స్థాయిలో తన ఆగమనాన్ని ఘనంగా చాటాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ముందస్తు లేదని ఆయన నోటితో చెబుతున్నా.. చేతలన్నీ మాత్రం నిర్ణీత గడువు కంటే ముందుగానే రాష్ట్రంలో ఎన్నికల కోసమే అన్నట్లు ఉంటున్నాయి. అందుకే నిర్ణీత గడువు కంటే ఆరు నెలలు ముందు కాకపోయినా కనీసం మూడు నాలుగు నెలల ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడం తథ్యమని రాజకీయవర్గాలు అంటున్నాయి. తెరాస శ్రేణులూ అలాగే భావిస్తున్నాయి.