చంద్ర బాబు కోసం!
posted on Oct 29, 2023 7:25AM
స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా ఆదివారం (అక్టోబర్ 29) న ‘కళ్లు తెరవాలి’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 గంటల వరకూ ఐదు నిముషాలు కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిజం గెలవాలి అని గట్టిగా నినదించాలని తెలుగుదేశం పిలుపునిచ్చింది. అలా చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించింది.
స్కిల్ డెవలప్‌మెంట్‌లో కుంభకోణం జరిగిందని.. అందులో నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సెప్టెంబర్ రెండో వారంలో ఆయన్ని జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ఆ క్రమంలో విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నాటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రంలోనే కాకుండా.. దేశ విదేశాల్లో సైతం ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. తెలుగుదేశం పార్టీ పలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆ క్రమంలో అక్టోబర్ 23న విజయదశమి రోజున మనం చేద్దాం జగనాసుర దహనం అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతకు ముందు అంటే అక్టోబర్ 15న న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం చేపట్టింది. అదే విధంగా అక్టోబర్ 7వ తేదీన కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక సెప్టెంబర్ 30న మోత మొగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇవన్నీ రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్య చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా చేపట్టారు. ఇంకోవైపు చంద్రబాబుని అరెస్ట్ చేసి 50 రోజులు పూర్తి కావోస్తోంది. సుప్రీంకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇక చంద్రబాబు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో.. ఆ విషయాన్ని తట్టుకోలేక 105 మంది మరణించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని నినదిస్తూ.. ఆయన భార్య నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ప్రజల మధ్యకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అరెస్ట్‌తో మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్పూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.