మేడిగడ్డపై పూర్తి సమాచారం ఇవ్వండి
posted on Oct 28, 2023 @ 4:48PM
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటనపై పూర్తి సమాచారాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఆదివారం( అక్టోబర్ 29)లోగా వివరాలు అందివ్వాలంటూ జాతీయ డ్యామ్ భద్రత అథారిటీ లేఖ రాసింది. అక్టోబర్ 23-26 మధ్య ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర కమిటీ తిరిగి ఢిల్లీ బయలుదేరకముందే వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే కొన్ని వివరాలు అందించగా మరికొన్ని వివరాలు కావాలని కేంద్రం నియమించిన కమిటీ సభ్యులు కోరుతున్నారు.
మొత్తం 20 అంశాలకు సంబంధించిన సమాచారం అడగగా 3 అంశాలకు సంబంధించిన డేటాను మాత్రమే ఇచ్చారని డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. ఒక అంశంపై పూర్తి సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన ఇటీవలే కుంగిన విషయం తెలిసిందే. భారీ శబ్దంతో కుంగింది. ఆ వెంటనే డ్యామ్ పరిశీలనకు కేంద్రం కమిటీని నియమించింది. బ్యారేజీలో 20వ పిల్లర్ కుంగుబాటు నేపథ్యంలో దానికి సమీపంలోని అయిదారు పిల్లర్స్ కు స్వల్పంగా పగుళ్లు ఏర్పడినట్లు నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. పిల్లర్ కుంగుబాటు అనంతరం పరిస్థితులపై నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదట బ్యారేజీ ఎగువన కాఫర్ డ్యాం నిర్మాణం, నీటిని తోడిపోయడం, పునాది వరకూ పరిశీలన, బ్యారేజీలో ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్ పరిస్థితిపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం నిపుణులను సంప్రదించి నిర్మాణ సంస్థతో పునరుద్ధరణ పనులు చేయించనున్నారు. ఇప్పటికే దీనిపై ఓ షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ మహాదేవపూర్ మండలం అంబటిపల్లి వద్ద ఈ నెల 21న కుంగింది. భారీ శబ్దంతో బీ - బ్లాకులోని 18, 19, 20, 21 ఫిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఓ అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20 ఫిల్లర్ కుంగడంతోనే వంతెన కుంగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. బ్యారేజీ పొడవు 1.6 కి.మీ ఉండగా, సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. బ్యారేజీ అకస్మాత్తుగా కుంగడంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా, ఈ ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.