Read more!

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ మళ్లీ తెరమీదకు!

దేశంలో జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.  అటు లోక్‌సభకూ, ఇటు రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపిస్తే.. ఎన్నికల నిర్వహణ ఖర్చు బాగా తగ్గుతుందని కేంద్రం చెబుతోంది.  నిన్న పార్లమెంట్‌లో దీనిపై కీలక   ప్రకటన చేసింది. జమిలికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించేందుకు.. రాజకీయ పార్టీలను ఒప్పించేందుకు ప్రయత్నం జరుగుతోందనీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు జరిపించే ఆలోచనలో ఉందా అన్న విపక్షాల ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు   జమిలికి పార్లమెంటరీ కమిటీ సానుకూలంగా ఉందని బదులిచ్చారు.

ఈ ఎన్నికల రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్ కోసం... దీన్ని న్యాయ కమిషన్‌కి సిఫార్స్ చేసినట్లు   వివరించారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా.. శాంతి భద్రతల సమస్య కూడా తగ్గుతుందనీ, అలాగే  రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చు కూడా   తగ్గుతుందని అన్నారు. ఈ కారణంగానే జమిలి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీంతో దేశంలో నెక్స్ట్ జరిగేది జమిలి ఎన్నికలేనా? కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా? అంటే ఔననే అనాల్సి వస్తోంది. నిజానికి, ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ, 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చింది మొదలు  కేంద్ర ప్రభుత్వం  జమిలి ఎన్నికలకు సుముఖగానే వుంది. సుముఖంగా ఉండడమే కాదు, అప్పటి నుంచి ఆ దిశగా పావులు కదుపుతూనే వుంది. 2019 బీజేపీ ఎన్నికల మానిఫెస్టోలో కూడా’జమిలి’ అంశాన్ని చేర్చారు. 2019ఎన్నికల తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమిలి పై చర్చకు .. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జమిలి ఎన్నికల మంచి చెడులను చర్చించారు.

కాంగ్రెస్,కమ్యూనిస్ట్ పార్టీలు, ఒకటి రెండు ప్రాతీయ పార్టీలు మినహా,  తెరాస సహా చాలా వరకు పార్టీలు  అప్పట్లో జమిలికి జై కొట్టాయి. నీతీ ఆయోగ్‌ కూడా నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్‌ రాజకీయ పార్టీల అభిప్రయాలను రికార్డు చేసింది.  మరో వంక జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్..‌ వన్‌ ఎలక్షన్‌ తో ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఎన్నికల సంఘం ఆ దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు, పార్లమెంట్ ఎప్పుడు ఆమోదం తెలిపినా, నిర్దిష్ట  సమయంలో లోక్ సభ, అసెంబ్లీలలతో పాటుగా స్థానిక సంస్థలు ఒకే సారి, ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా వుందని, అధికారులు పలు సందర్భాలలో పేర్కొన్నారు.

అంతే కాదు, జమిలి ఎన్నికల అవసరాన్ని, ప్రయోజనాలను వివరిస్తూ నిర్వహించే సెమినార్లు, వర్క్ షాపులలో కేంద్ర ఎన్నికల సంఘం క్రియాశీలక భూమిక  పోషిస్తోంది. జమిలి ఎన్నికలకు సానుకూల వాతావరణం ఏర్పరిచే విషయంలో  కేంద్ర ఎన్నికల సంఘం తన వంతు పాత్రను పోషిస్తోంది.   తాజగా  కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటులో ఇదే విషయం చెప్పారు. వాస్తవానికి దేశంలో 1951, 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. 1968, 69లో పలు అసెంబ్లీలు నిర్ణీత గడువు కంటే ముందే రద్దు కావడంతో జమిలి ఎన్నికలకు అంతరాయం కలిగింది.