Read more!

జగన్ విశాఖకు రావద్దు.. ఎన్నిక ఫలితం సారాంశమిదే!

ప్రశాంత వాతావరణము కోరుకునే విశాఖ ప్రజలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రాజధాని వద్దని తేల్చి చెప్పేశారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఫలాతాలు తేల్చేసిన వాస్తవం ఇదే.  అత్యంత ప్రశాంతంగా ఉండే విశాఖ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన నటి నుంచి అశాంతికి నిలయంగా మారిపోయింది. ఆ విషయాన్ని ఉత్తరాంధ్రప్రజలు గుర్తించారు.  

ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది, శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. స్థానికులు భద్రతా లేమితో బాధపడుతున్నారు.  ఏదైనా స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడితే ఇక ఆ స్థల యజమాని దానిపై ఆశలు వదిలేసుకోవలసిందే అన్న పరిస్థితి ఏర్పడింది. ఇంత కాలం పంటి బిగువున బాధను, ఆగ్రహాన్ని అణచుకున్న జనాగ్రహాన్ని  పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో వెళ్లగక్కడారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి చిరంజీవిని భారీ మెజారిటీతో గెలిపించి వైసీపీకి గ్రాడ్యుయేట్లు తమ సత్తా చూపారు. రేపు అసెంబ్లీ ఎన్నికలలోనూ జనం ఇదే రీతిక స్పందిస్తారని, ఇది ట్రయల్ మాత్రమేనని ఉత్తరాంధ్ర వాసులు అంటున్నారు.  ప్లీజ్ డోంట్ కమ్ టు విశాఖ అని ముఖ్యమంత్రి జగన్ కు పట్టభద్రులు తమ ఓటు ద్వారా విస్పష్టంగా తేల్చి చెప్పేశారు.

అదే విధమైన పోస్టర్లను జనం విశాఖ అంతటా ప్రదర్శించారు.  గత రెండేళ్లుగా విశాఖకు వస్తానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. వద్దు బాబోయ్ అని గ్రాడ్యుయేట్లు ఒక దణ్ణం పెట్టేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిని ఓడించి తమ అభిమతమేమిటో చెప్పేశారు. ఇక విశాఖ రాజధాని కాదు..విశాఖలో ఓ క్యాంపు కార్యాలయం పెట్టుకుని ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చున్నంత మాత్రాన విశాఖ రాజధాని కాదు, కాలేదు, కాబోదు. ఈ విషయంలో స్పష్టతతో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలు  వచ్చే ఎన్నికలలో పట్టభద్రులు చూపిన బాటలోనే నడుస్తామంటూ చిరంజీవి విజయాన్ని పురస్కరించుకుని చేసుకుంటున్న సంబరాల ద్వారా చాటుతున్నారు.  

ఏదో సినిమా డైలాగులా  జీతాలు ఎప్పుడు ఇచ్చామన్నది కాదు… ఇచ్చామా లేదా అన్నదే ముఖ్యమని అహంకారంతో చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ చెంపపెట్టులాంటి ఈ తీర్పుపై ఏమని స్పందిస్తారో చూడాలి.  ఇక గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ మూడు స్థానాలకు జరిగిన ఎన్నికలలో రెండింట్లో ఓడి.. మూడో స్థానంలో ఓటమి అంచుల్లో ఉంది. ఈ పరిస్థితే  వైసీపీ పట్ల జనంలో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది. వైనాట్ 175 అంటున్న అధినేత ఇప్పుడు ఏమంటారో చూడాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన రెండు స్థానాలలోనూ గెలిచాం అన్న ఆనందం కూడా వైసీపీకి దక్కలేదు. ఎందుకంటే ఆ రెండు స్థానాలలోనూ కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలిక కారణంగానే విజయం సాధించగలిగింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేదని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చేశారు. దాంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూసి సంబరపడే అవకాశం లేకుండా పోయింది వైసీపీకి.