వయసు 90 పైనే...కలయితో 16 అయింది!
posted on Oct 25, 2022 @ 4:57PM
స్నేహం మీద అనేకానేక కథలు, సినిమాలు వచ్చేశాయి. హీరో విలన్ కలిసిపోవడం, ఒక పెద్దాయన కష్టాల్లో ఉన్నాడని తెలిసి మరో వ్యక్తి సహాయానికి వెళితే అతను తన బాల్యమిత్రుడని గుర్తించి ఆనందంగా సాయంచేయడం.. స్నేహ మేరా జీవితం.. అంటూ గట్టిగా కావలించేసుకుని పాడేసుకోవడం.. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ పెద్ద రోడ్డుకి అవతల నుంచి స్నేహితుడి కోసం పరుగులు తీసి ఇవతలున్న స్నేహితుడిని కలవడం.. మామూలే. చిత్రమేమంటే ఇద్దరు పెద్దవాళ్లు ఏకంగా 75 ఏళ్ల తర్వాత కలిశారు. వారి ఉద్వేగానికి అంతే లేదు.
బాల్యంలో కలిసినవారు అనేకానేక కారణాల వల్ల విడిపోయి చాలాకాలం తర్వాత కలవడం వింటూనే ఉంటాం. అయితే మరీ ముదిమి వయసులో కలవడమే ఈ యిద్దరి ప్రత్యేకత. అవును ఎప్పుడు రెండో ప్రపంచయుద్ధంలో కలిసి పనిచేసిన కుర్రాళ్లు పండు ముసలి వయసులో హఠాత్తుగా ఎదురయ్యారు. తప్పకుండా ఇది తెలుగు సీనిమా సీన్ అయితే కాదు.
ఒక షాపింగ్ మాల్ కి 95 ఏళ్ల పెద్దాయన మనవరాలితో వెళ్లాడు. అక్కడ కొంతసేపు కాలక్షేపం చేసి బయటికి వస్తున్నాడు. అప్పుడే దాదాపు అంతే వయసున్న మరో పెద్దాయన మనవడి సాయంతో లోపలికి వచ్చాడు. లోపలికి వస్తూనే అవతలి ముసలాయన్ని గుర్తించాడు. వీడు నా ఫ్రెండ్ అని గుర్తించాడు. అంతే పరుగులాంటి నడకతో వెళ్లి ఆ ముసలాయన్ని కౌగిలించుకున్నాడు. నేన్రా.. నేను.. అంటూ రెండో ప్రపంచయుద్ధసమయంలో నేవీలో పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేశాడు. అవును నిజమే.. అనుకుని పేలవంగా నవ్వలేదు.. అమాంతం హత్తుకున్నాడు.. ఆ ముసలాయన కూడా.
పెద్దాయన వాళ్లింటికి తీసికెళ్లాడు...75 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితుడితో 90 సంవత్సరాల సంభాషణ చేశాడు. యుద్ధానికి వెళ్లడం, అంతకుముందు కలిసిన రోజు, కలిసి నేవీలో పనిచేయడం, అంతా.. కానీ ఆ తర్వాత ఎంతో వెతికానని ఎవరూ తన గురించి చెప్పలేకపోయారని చెప్పుకున్నారు.. వారికి కనీసం మూడు గంటలపాటు ఆకలి అనిపించలేదు, డ్రింక్స్ అలానే ఉండిపోయాయి, అంతా మాటలు, కబుర్ల ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఎన్నో కథలు, ఎన్నో సరదాలు, సీరియస్ అంశాలు, పిల్లలు, మనవలు, మనవరాలు, ఆనందం, దుఖం, నవ్వులు, కాసిని ఏడుపులు... సర్వం వారిద్దరి మధ్యా అలా ప్రవాహ మయ్యాయి.
స్నేహబలం అంతే. ఎన్నాళ్లుపోయినా యంగ్ అండ్ ఎనర్జటిక్. అవును వాళ్లిద్దరూ పదహారేళ్లవారే. వాళ్లే కాదు అలా కలిసినవారంతా పరమ కుర్రాళ్లే. మీరయినా అంతే. పాత బాగా పాత... కనీసం ముప్పయ్యే ళ్లయినా కలవని స్నేహితులను కలవడానికి ప్రయత్నించండి.. వయసు, వ్యధలు, మౌనం.. అన్నీ వీడిపోతాయి.