ప్రజా ఆరోగ్యానికి అదనంగా 12 వేల కోట్లు..
posted on Oct 9, 2022 7:47AM
ప్రజారోగ్యానికి ఒడిషా ప్రభుత్వం పెద్దపీట వేసింది. వైద్యం సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారీగా కేటాయింపులు పెంచింది. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యానికి ప్రాముఖ్యత పెంచడానికి నిర్ణయించుకుంది. ప్రజారోగ్యంలో ఆయుర్వేదం ప్రాముఖ్యతను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.
వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా మరో 12 వేల కోట్ల రూపాయల కేటాయింపులు పెంచింది. ఈ మేరకు ఒడిషా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వైద్య ఆరోగ్య శాఖకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ఆయుర్వేదం వేల సంవత్సరాలుగా ప్రభావమంతంగా పని చేస్తోందనీ, సాంప్రదాయ ఆయుర్వేదానికి అనుభవం, ఆధునికతను జోడిస్తే ఆరోగ్య వ్యవస్థ మరింత ప్రభావమంతంగా పని చేస్తుందని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.
ప్రజా ఆరోగ్యం విషయంలో 5టీ విధానాన్ని(టీం వర్క్,ట్రాన్స్ పరెన్సీ, టెక్నాలజీ, టైంమేనేజ్ మెంట్, ట్రాన్స్ఫర్మేషన్) అనుసరించాలని వైద్య అధికారులకు నవీన్ పట్నాయక్ సూచించారు. 5టీ విధానాన్ని అనుసరిస్తే వైద్య రంగం పురోభివృద్ధి చెందడమే కాకుండా వైద్య చికిత్స వ్యయ భారం తగ్గి సామాన్యుడికి అందుబాటులోకి వస్తుందని పట్నాయక్ అన్నారు.
ప్రపంచ దేశాలకు దీటుగా నాణ్య మైన వైద్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వైద్యఖర్చులు పెరగడంతో వైద్యం సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నదని ఆయన పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా వైద్య ఆరోగ్య శాఖ కు నిధులు పెంచుతూనే ఉన్నామని, ఇప్పుడు మరో ముందడుగు వేసి గతంతో పోలిస్తే రెండింతలు నిధులు పెంచామనీ, అదే గత మూడేళ్లతో పోలిస్తే ప్రణాళికలో అదనంగా 6శాతం నిధులు చేర్చామని పేర్కొన్నారు.