తుగ్లక్ చేష్టలకు హేతువేంటి?
posted on Oct 9, 2022 8:17AM
ఒకరు సాధించిన నేత.. మరొకరు దానం చేసిన దాత.. వారిపై జగన్ రెడ్డి అంత పగ ఎందుకు పెంచుకున్నారో అర్థం కాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. తుగ్లక్ పాలనలో కూడా ఇంతటి వికృత చర్యలు చూడలేదంటున్నారు. ఈ అరాచక పాలనకు అడ్డూ అదుపూ లేదా.. మహనీయుల పేర్లు మార్చడమేంటి? అంటూ ఏపీ జనం తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. జగన్ చెప్పిన అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఆయా సంస్థలకు ఉన్న పేర్లను మార్చడమేనా అని ప్రతిపక్ష నాయకులు నిలదీస్తున్నారు. జగన్ తుగ్లక్ చర్యలకు అవాక్కవుతున్నారు ఆంధ్రా జనం.
గతంలో 17 ఎకరాల భూమిని ఇచ్చిన అశోక్ గజపతి రాజు తండ్రి పీవీజీ రాజు పేరుతో 1983లో విజయనగరం ఆస్పత్రికి మహారాజా ఆస్పత్రిగా పేరుపెట్టారు. ఇప్పుడు రాత్రికి రాత్రే ఈ ఆస్పత్రికి మహారాజా పేరు తొలగించిన జగన్ సర్కార్ 'ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి'గా మార్చడాన్ని చూసి జిల్లా జనం భగ్గుమంటున్నారు.
విపక్ష నేతల కుటుంబీకుల పేర్లతో ఉన్న సంస్థలను వైసీపీ సర్కార్ టార్గెట్ చేస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పేరు మార్చడం కక్షపూరిత చర్య అని, ప్రముఖుల పేర్లపైనే ఇలా పగబట్టినట్టు వైసీపీ సర్కార్ వ్యవహరిస్తోందని నిప్పులు చెరుగుతున్నారు. దశాబ్దాల నుంచి ప్రభుత్వ సంస్థలకు ఉన్న ప్రముఖుల పేర్లను ఒక్కొక్కటిగా వైసీపీ సర్కార్ తొలగిస్తుండడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతల కుటుంబీకుల పేర్లతో ఉన్న సంస్థలను జగన్ సర్కార్ టార్గెట్ చేయడాన్ని తూర్పారపడుతున్నారు.
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును జగన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల మార్చేసిన సంగతి తెలిసిందే. వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టింది. తాజాగా విజయనగరం జిల్లా కేంద్రంలో టీడీపీ నేత పి. అశోక్ గజపతిరాజు వంశీయుల పేరుతో ఉన్న మహారాజా జిల్లా కేంద్ర ఆసుపత్రి పేరును రాత్రికి రాత్రే మార్చేశారు. అర్ధరాత్రి ఉన్నట్టుండి మహారాజా పేరు తొలగించి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అంటూ బోర్డు పెట్టేశారు.
ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు 1983లో విజయనగరం పూసపాటి రాజవంశానికి చెందిన అశోక్ గజపతి రాజు తండ్రి పీవీజీ రాజు భూములు ఇచ్చారు. దీంతో మహారాజా జిల్లా ఆసుపత్రిగా అప్పట్లో దానికి పేరు పెట్టారు. వైద్య విధాన పరిషత్ లోకి వచ్చిన తర్వాత కూడా మహారాజా జిల్లా ఆసుపత్రిగానే దాని పేరును కొనసాగించారు.
విజయనగరంలోని ఆసుపత్రి మొదట తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉండేది. అది ఇరుకుగా ఉండటంతో అభివృద్ధికి అవకాశం లేకపోయింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి కోసం 17 ఎకరాల స్థలాన్ని 1983లో పీవీజీ రాజు ఇచ్చారు. ఇందులోనే ప్రస్తుత జిల్లా కేంద్ర ఆసుపత్రి, భోధనాసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, డీసీహెచ్ఎస్ కార్యాలయం, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఇంజనీరింగ్ విభాగం, క్షయవ్యాధి నివారణ కార్యాలయం, వాక్సినేషన్లు భద్రపర్చే భవనం, ఆయుర్వేద ఆసుపత్రి ఉన్నాయి. ఇలా అనేక విభాగాలు మహారాజా ఆసుపత్రి ప్రాంగణంలో నడుస్తున్నాయి.
టీడీపీ నేతల కుటుంబీకులపేర్లను తొలగిస్తుండడంతో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం చెలరేగింది. అధికార వైసీపీలో కూడా అభ్యంతరం వ్యక్తమైంది. అయినా పేర్ల మార్పు రాజకీయాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుండడం జగన్ తుగ్లక్ పాలనకు మరో నిదర్శనం అంటున్నారు.