బీజేపీకి ఈశాన్య గండం!
posted on Jan 20, 2023 @ 10:14AM
బీజేపీ వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమౌతోంది. ఈ ఏడాది జరగనున్న తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ విజయం సాధించాలన్న నిర్ణయంతో అడుగులు వేస్తోంది. పాలనా వ్యవహారాలన్నీ పక్కన పెట్టేసి కేంద్రం కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోయింది. ఈ ఏడాది ఇప్పటికే తొలి ఎన్నికల నగారా మోగింది. మూడు ఈశాన్య రాష్ట్రాలలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 2న విడుదల కానున్నాయి. అయితే కొత్త ఏడాది లో జరగనున్న మూడు ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీకి కేక్ వాక్ కాదు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించేసిన బీజేపీకి ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు పెద్ద అగ్నిపరీక్షగానే మారనున్నాయి.
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో బీజేపీ విజయంపై పరిశీలకులే కాదు, బీజేపీ శ్రేణులు కూడా నమ్మకంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ మూడు రాష్ట్రాలలో త్రిపురలో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. త్రిపురలో గత ఎన్నికల్లో మేజిక్ ఫిగర్‌ను సాధించి అధికారంలోకి వచ్చింది బీజేపీ. అంతకు ముందు త్రిపురలో బీజేపీకి ఉనికి కూడా నామమాత్రం అన్నట్లుగా పరిస్థితి ఉంది.
అలాంటి స్థితి నుంచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో అంతర్గత విభేదాలు తీవ్ర మయ్యాయి. 2018లో విప్లవ్ దేవ్‌ను సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ ఆయనను దింపేసి మాణిక్ సాహాను సీఎం చేసింది. ఇప్పుడు ఆయన కూడా పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. త్రిపురలో బెంగాలీ జనాభా ఎక్కువ. ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాలు, మమతా బెనర్జీ బరిలో నిలిస్తే.. బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురౌతాయి. ఇక మేఘాలయ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో బీజేపీకి ఉన్నది రెండే రెండు సీట్లు. అయితే నేషనల్ పీపుల్స్ పార్టీకి మద్దతిచ్చి ప్రభుత్వంలో భాగం అయింది. . అయితే, ఇప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తుకు బీటలు వారాయి . తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని మేఘాలయ ముఖ్యమంత్రి సీఎం కన్రాడ్ సంగ్మా ప్రకటించి బీజేపీతో పొత్తు లేదని విస్పష్టంగా చెప్పేశారు.
అలాగే బీజేపీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపుతామని ప్రకటించింది. అయితే వాస్తవానికి మేఘాలయలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఒకటి, రెండు సీట్లు సాధిస్తే.. బలవంతంగా అధికార కూటమిలో చేరే అవకాశం ఉంటుంది. నాగాలాండ్‌లో కూడా బీజేపీ ఒంటరి విజయం సాధించే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ పార్టీ సంకీర్ణ కూటమిలో భాగస్వామి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు. గత ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు 20 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నది. మరోవైపు గిరిజన తెగలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
ఏ విధంగా చూసుకున్నా.. 2024 సార్వత్రిక ఎన్నికల టార్గెట్ లో భాగంగా బీజేపీ నిర్దేశించుకున్న మిషన్ 9లో తొలి మూడు రాష్ట్రాలలోనే ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకే ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్ష అనే చెప్పాలి.