మంగళగిరిలో నారా లోకేష్ కు నల్లేరు మీద బండి నడకే!
posted on Jan 20, 2023 @ 10:39AM
మంగళగిరిలో అధికార వైసీపీకి ఆ పార్టీలోని లీడర్ల నుంచి కేడర్ వరకు అంతా వరుసగా ఝలక్ ఇచ్చారు... ఇస్తున్నారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. తెలుగుదేశం పార్టీలో చేరారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, కోమ్మారెడ్డి వీరారెడ్డి, నూతలపాటి నంబూద్రిపాద్, తిరువీధుల నరసింహమూర్తి తదితరులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు.ఇటీవలి కాలంలో వైసీపీ నుంచి భారీగా తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. అలా వలస వస్తున్న వారిలో లీడర్ నుంచి కేడర్ వరకు ఉంటున్నారు.
అయితే టీడీపీలోకి వైసీపీ నుంచి వలసలు పోటెత్తడంపై విపక్ష నేతగా వైయస్ జగన్.. నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలకు.. అలాగే ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. ఆయన అమలు చేస్తున్న విధానాలకు ఎక్కడా పొంతన లేదని... ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే.. మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారనీ, ఆ కారణంగా వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను గమనించే మంగళగిరిలో వైసీపీ ఖాళీ అయిపోతోందనీ స్థానికులు చెబుతున్నారు.
అలాగే 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రచారంలో భాగంగా.. నాటి ప్రతిపక్ష నేత జగన్.. టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌పై పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. తన కేబినెట్‌లో ఆయనకు మంత్రి పదవి ఇస్తానని.. నియోజకవర్గ ప్రజల సాక్షిగా ప్రకటించారు... కానీ వైయస్ జగన్.. తన రెండు కేబినెట్ల కూర్పులో ఎక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు కనిపించలేదు.. వినిపించలేదు. ఇలా జగన్ ప్రతిపక్షనేతగా మాట తప్పం.. మడం తిప్పమంటూ ప్రకటించి, ముఖ్యమంత్రి కాగానే.. మాట తప్పేయడం.. మడమ తిప్పేడయం చేశారని నియోజకవర్గ ప్రజల్లు సోదాహరణగా చెబుతున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి జంప్ చేసిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీకి సైతం వైయస్ జగన్... తన కేబినెట్‌లో అత్యంత కీలక శాఖల్లో ఒకటైన వైద్య ఆరోగ్య శాఖను కట్టబెట్టారని.. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకానొక దశలో తీవ్రంగా హర్ట్ అయి.. బుంగమూతి సైతం పెట్టుకున్నారని.. అందుకే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని.. ఇప్పటికే ఎమ్మెల్యే ఆళ్ల... స్వయంగా తన కేడర్ వద్ద పేర్కొన్నట్లు ఇప్పటికే నియోజకవర్గంలో ఓ టాక్ అయితే హల్‌చల్ చేస్తోంది.
ఇంకోవైపు గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా నారా లోకేశ్.. గత మూడున్నర్లేళ్లుగా నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటూ.. వారి సమస్యలపై అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారని.. అలాగే నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు ... ఆరోగ్య సంజీవినీ పేరిట మొబైల్ వైద్యశాలలు సైతం ఏర్పాటు చేశారు.
ఇంకోవైపు.. మంగళగిరి టీడీపీలో బలమైన నాయకుడిగా పేరున్న గంజి చిరంజీవి లాంటి వారిని సైతం జగన్ పార్టీ ఆకర్షించేసిందని.. అలాగే వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్ విజయాన్ని అడ్డుకునేందుకు ఎంత చేయాలో అంతా చేసేందు ఫ్యాన్ పార్టీ అధినేత, సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఎం హనుమంతరావును సైతం ఇలా పార్టీలొకి తీసుకుని.. అలా ఆయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేశారని నియోజకవర్గ ప్రజలే అంటున్నారు. అలాంటి సమయంలో సైతం.. మంగళగిరి నియోజకవర్గంలోని జగన్ పార్టీలో కీలక నేతలంతా.. వరుసగా సైకిల్ ఎక్కేస్తుండటం పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెబుతోందని అంటున్నారు.
ఇక నారా లోకేశ్.. యువగళం పేరుతో చేపట్టనున్న పాదయాత్ర. జనవరి 27న కుప్పంలో ప్రారంభం కానుంది. దాదాపు 400 రోజుల పాటు.. నాలుగువేల కిలోమీటర్లు మేర ఈ పాదయాత్ర సాగనుంది. అలా నారా లోకేశ్.. ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకొంటూ..ఈ జగన్ ప్రభుత్వంలోని పాలన వైఫల్యాలను తన గళంతో ఎండగడుతూ.. నారా లోకేశ్ ముందుకు సాగనున్నారు.