Read more!

మంత్రులు రారు.. సందర్శకులు లేరు.. తెలంగాణ సచివాలయం వెలవెల

తెలంగాణలో రేవంత్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన క్షణం నుంచీ సచివాలయం కళకళలాడింది. అంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులు సహా సామాన్యులెవరికీ సచివాలయ ప్రవేశానికి అనుమతి ఉండేది కాదు. కానీ రేవంత్ సీఎం కాగానే నిర్ణీత వేళలలో అందరికీ సచివాలయ ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. దీంతో తెలంగాణ సచివాలయం నిత్యం సందర్శకులతో కళకళలాడింది. అయితే గత కొన్ని రోజులుగా సచివాలయం వెలవెలబోతున్నది.

సందర్శకులెవరూ సెక్రటేరియెట్ వైపు రావడం లేదు. ఇందుకు కారణం మంత్రుల కానీ, ముఖ్యమంత్రి కానీ సచివాలయం ముఖం చూడకపోవడమే. అరే ఏమిటిది? రేవంత్ కు ఆయన కేబినెట్ మంత్రులకు ఏమైంది. వారి సెక్రటేరియెట్ కు ఎందుకు దూరంగా ఉంటున్నారు. రేవంత్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే సచివాలయానికి దూరంగా ఇంటి వద్దనుంచే పని చేయాలని నిర్ణయించుకున్నారా అన్న అనుమానాలు సహజంగానే ఎవరికైనా వస్తాయి. కానీ కారణం అది కాదు. 

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో మంత్రులంతా తమతమ నియోజకవర్గాలలో పార్టీ ప్రచార సన్నాహాలలో మునిగిపోయారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ సచివాలయానికి దూరంగా ఉండటమే బెటర్ అని నిర్ణయించుకున్నారు.  ఇక ప్రభుత్వానికి సంబంధించిన రోజూ వారీ వ్యవహారాలను తమతమ ఇళ్ల నుంచే పర్యవేక్షించాలని సీఎం, మంత్రులు నిర్ణయించుకున్నారు. దీంతో సెక్రటేరియెట్ లో ముఖ్యమంత్రి సహా మంత్రులెవరూ అందుబాటులో ఉండరని తేలడంతో సందర్శకులు సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది.  

అంతే కాకుండా కోడ్ అమలులో ఉన్న కారణంగా అధికారులను కలిసినా పనులు అయ్యే పరిస్థితి లేకపోవడంతో విజిటర్స్ టైమ్ లో కూడా సందర్శకులు సచివాలయానికి రావడం పూర్తిగా మానేశారని అంటున్నారు.