Read more!

కవిత అరెస్టుపై స్పందించని తెలంగాణ !.. అందరిలో స్వయంకృతమేనన్న భావన!

కల్వకుంట్ల కవిత అలియాస్,  డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. సిస్టర్ ఆఫ్ కల్వకుంట్ల తారకరామారావు. తెలంగాణకే కాదు.. కాస్త రాజకీయ పరిజ్ణానం ఉన్న ఎవరికీ కూడా  పరిచయం అక్కరలేని పేరు.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు తరువాత ఆమె పేరు దేశ వ్యాప్తంగా అందరికీ చిరపరిచితమై పోయింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమెదే కీలక పాత్ర అని  ఈడీగా అందరూ పిలిచే ఎన్‌ఫోర్స్‌మెంట్ చాలా చాలా గట్టిగా చెబుతోంది. కవిత కంప్యూటర్ సైన్స్ లో బీటెక్‌ ఆ తరువాత  ఎంఎస్‌  చేసి, అమెరికాలో ఉద్యోగం కూడా చేశారు. భర్త దేవనపల్లి అనిల్‌కుమార్‌తో అక్కడే స్థిరపడ్డ ఆమె  తండ్రి కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమనేతగా ఉన్న సమయంలో అంటే 2006లో తిరిగి భారత్ కు వచ్చారు.

ఉన్నత విద్యావంతురాలు, యుక్తాయుక్త విచక్షణ తెలిసిన కవిత ఉద్యమంలో చురుకుగా వ్యవహరించడాన్ని అంతా స్వాగతించారు. దీంతో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ, ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.  తెలంగాణ జాగృతి అనే సాంస్కృతిక సంస్థ ద్వారా తెలంగాణ సంస్కృతికి, ఆచారాలకు, పండుగలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం వచ్చేలా కృషి చేశారు. దేశ విదేశాల్లో జాగృతి శాఖలను ఏర్పాటు చేసి తెలంగాణకు, తద్వారా తెలంగాణ ఉద్యమానికి విస్తృత ప్రచారం కల్పించారు. మొత్తంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు కవిత ఐకాన్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. తెలంగాణ ఉద్యమం మహోధృత స్థాయికి చురుకున్న సమయంలో కవిత తెలంగాణ సంస్కృతి, భాష, యాసల విషయంలో చాలా సీరియస్ రోల్ ప్లే చేశారు. వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని సినిమాలను లక్ష్యంగా చేసుకుని  పెద్దఎత్తున వసూళ్లు చేశారని పరిశ్రమ వర్గాలు ఇప్పటికీ చెబుతుంటాయి.

అలాగే   రియల్ ఎస్టేట్‌లో సెటిల్‌మెంట్ల ద్వారా కూడా కవిత బాగా గడించారని అంటారు.  ఇక నిజామాబాద్ నుండి ఎంపీగా ఎన్నికై, ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత కవిత  అక్కడ కూడా పాపులర్ అయ్యారు. ఇంగ్లిష్‌ భాషపై పట్టు కవితకు బాగా ప్లస్ అయ్యిందంటారు.  పార్లమెంట్ కమిటీల్లో స్థానం దక్కి, ఎంపీ హోదాలో పలుదేశాల్లో పర్యటించే అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తండ్రి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో తండ్రి అధికారమే అలంబనగా ఆమె సంపాదనా మార్గం పట్టారని పార్టీ వర్గేలే ఇప్పుడు చెప్పుకుంటున్నాయి.  అప్పట్లో తండ్రి కేసీఆర్ హెచ్చరికలను కూడా ఆమె పట్టించుకునేవారు కారని అంటారు. 

ఇక ప్రస్తుతానికి వస్తే.. ఎక్కడో ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధానాన్ని రూపొందించాలని భావిస్తే.. ఆ విషయం తెలుసుకున్న కవిత  ఆప్ ప్రభుత్వ పెద్దలను కలిసి, రకరకాలుగా ప్రలోభపెట్టి, పాలసీని అవినీతికి అనుకూలంగా ఉండేట్టు తయారుచేయించారనేది ఆమెను అరెస్టు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అభియోగం.  ఈ కుంభకోణంలో  ఏపీకి చెందిన రాజకీయ నాయకుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్‌, బోయినపల్లి అభిషేక్‌, అరబిందో ఫార్మా శరత్‌చంద్ర, అరుణ్‌ పిళ్లై, ఢిల్లీకి చెందిన సుఖేశ్ చంద్రశేఖర్‌, గురుగ్రామ్‌కు చెందిన అమిత్ ఆరోరాలు ముఖ్య భూమికలు పోషించారు. ఇందులో దక్షిణాది చెందిన వారిని సౌత్ గ్రూప్ లాబీగా ఈడీ పేర్కొంది.   పంజాబ్ ఎన్నికల్లో ఆప్ విజయానికి సొమ్ములు అన్న ప్రలోభానికి లొంగి కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియా కవిత ప్రతిపాదనలకు అంగీకరించారనీ ఈడీ ఆరోపిస్తోంది.

వారు ఇలా మద్యం పాలసీకి అంగీకరించారో లేదో అలా  100 కోట్ల రూపాయలు వారికి అందాయనీ అంటున్నారు. ఇక అక్కన్నుంచి మద్యం పాలసీ ద్వారా మద్యం కొనుగోలు, పంపిణీ, డీలర్ల కమీషన్‌, ఎంఆర్‌పీ అన్నీ మారిపోయాయి. విచ్చలవిడి అమ్మకాల ద్వారా డీలర్ల కమీషన్ పెంచడం ద్వారా, 200 కోట్లకు పైగా ఇప్పటివరకు అక్రమ సంపాదన జరిగి ఉంటుందన్నది ఈడీ ఆరోపణ.  ఇందులో డబ్బులను పెద్దయెత్తున అటూ-ఇటూ తరలించిన మోసగాడు సుఖేశ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. సుఖేష్ ను అప్రూవర్ గా మార్చుకుని  అందరి జాతకాలు వెల్లడించారని అంటున్నారు. దీంతో ఆప్ కు చెందిన సీనియర్ నాయకులు అరెస్టయ్యేనాటికి మంత్రి అయిన సత్యేంద్రజైన్‌, అప్పటికి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియా జైలుపాలయ్యారు. ఇదే కేసులో  కవితను సీబీఐ, ఈడీ పలుమార్లు విచారించారు. ఈ కుంభకోణంలో  కవితకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు సేకరించారు.  ఇందుకు అప్రూవర్ గా మారిన సుఖేష్ కీలక సమాచారాన్ని అందించారు.  బీఆర్ఎస్‌కు, బీజేపీకి లోపాయికారీ సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపణలను జనం నమ్మడంతోనే అసెంబ్లీ ఎన్నికలలో అనుకున్న స్థాయిలో విజయాలు నమోదు చేయలేకపోయామని భావిస్తున్న బీజేపీ  లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈడీ కవితను అరెస్టు చేయడం వెనుక ఉందన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.

 మొత్తం మీద కవితను ఈడీ అరెస్టు చేయడం రాజకీయంగా బీఆర్ఎస్ కు తేరుకోలేని దెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ ఏ మేరకు లబ్ధి పొందుతుందన్నది లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో ఆ పార్టీ గెలుచుకునే ఎంపీ స్థానాల సంఖ్య తేలుస్తుంది. అయితే కవిత అరెస్టు ఎపిసోడ్ కచ్చితంగా సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏడాదిన్నరగా తీహార్ జైలులోనే ఉన్న సిసోడియాకు ఇంతవరకు బెయిల్ లభించక పోవడం, కవితకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలుండటంతో కవితకు కూడా  ఇప్పట్లో  బెయిలు లభించే అవకాశాలు లేవని చెబుతున్నారు. కవిత అరెస్టు రోజు నుంచీ బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ ఢిల్లీలోనే మకాం వేశారు. కేసీఆర్ పూర్తిగా మౌనం వహిస్తున్నారు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నాహకాలు పెద్దగా లేవనే చెప్పాలి.  

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. తెలంగాణ ఉద్యమ నేత, ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ పితగా నిన్నటి వరకూ ప్రజల మన్ననలు అందుకున్న కేసీఆర్ తనయను ఈడీ అరెస్టు చేస్తే తెలంగాణ ప్రజలు పెద్దగా స్పందించలేదు. రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగలేదు. చాలా ఉదాశీనంగా వ్యవహరించారు. ఇక కవిత పట్ల ప్రజల నుంచే కాదు, పార్టీ శ్రేణుల నుంచి కూడా ఏ మంత సానుభూతి లభించలేదు. పైపెచ్చు అవినీతికి పాల్పడితే అనుభవించక తప్పదుకదా అన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అధికారంలో ఉండగా అహం తలకెక్కి ఇష్టారీతిగా వ్యవహరించిన నేతలకు కవిత ఎపిసోడ్ ఒక గుణపాఠం కావాలని జనం అంటున్నారు. మొత్తంగా కవిత అరెస్టు కావడానికి కారణం ఆమె స్వయంకృతాపరాధమే తప్ప రాజకీయ కారణాలేవీ కావని తెలంగాణ ప్రజ నమ్ముతోంది. అందుకే ఎటువైపు నుంచీ కూడా ఆమెకు కానీ, కేసీఆర్ కు కానీ సానుభూతి లభించడం లేదు.

అదే ఇదే కేసులో కేజ్రీవాల్ అరెస్టైతే ఆప్ నేతలు, శ్రేణులే కాదు, దేశ వ్యాప్తంగా బీజేపీ ఏతర పార్టీలన్నీ ముక్తకంఠంతో ఆయన అరెస్టును ఖండిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయడంలో భాగంగానే బీజేపీ ఈడీని ప్రయోగించి కేజ్రీవాిల్ ను అరెస్టు చేయించిందని అంటున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రం ప్రజల నుంచి కానీ, ఇతర రాజకీయ పార్టీల నుంచి కానీ సహాయ సహకారాలు అందడం లేదు.