ఏపీ మంత్రులు, సలహాదారులు ప్రభుత్వ వాహనాలు వాడడంపై ఎస్ఈసీ ఆంక్షలు..
posted on Jan 30, 2021 @ 4:48PM
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య లేఖల యుద్ధం తార స్థాయికి చేరింది. తాజాగా అయన ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కి మరో లేఖ రాస్తూ.. మంత్రులు, సలహాదారులు ప్రభుత్వ వాహనాలు వినియోగంపై అయన ఆంక్షలు విధించారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనిని మరో వివాదాస్పదమైన లేఖగా భావిస్తున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సందర్భంగా.. ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఈ ఆదేశాలను పూర్తిగా అమలు చేయాలని అయన సీఎస్‌కు సూచించారు. రాష్ట్ర మంత్రులు, సలహాదారులు, ప్రభుత్వోద్యోగులు, ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందకి వస్తారని నిమ్మగడ్డ తాజాగా రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల పర్యటనల్లో ఉద్యోగులు పాల్గొనరాదని నిమ్మగడ్డ సూచించారు.
మరోపక్క పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కుల ధృవీకరణ పత్రాలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా పంచాయతీ ఎన్నికల్లో పాత కుల ధృవీకరణ పత్రాలను అనుమతించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కొత్త ధృవీకరణ పత్రాలు కావాలని ఎవరిని ఒత్తిడి చేయకూడదని ఆ ఆదేశాలలో తెలిపింది. కొత్త సర్టిఫికెట్లు సమర్పించేందుకు నిర్ణీత సమయం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఎన్నికలలో పోటీ చేసే వారికి ఫాస్ట్ ట్రాక్ విధానంలో కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఎస్ఈసీ ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు తమ బకాయిల చెల్లింపునకు వస్తే వెంటనే తీసుకోవాలని కూడా ఆదేశించింది.