ర్యాలీ తర్వాత వంద మంది రైతులు మిస్! పోలీసులు తీసుకెళ్లారనే అనుమానాలు
posted on Jan 30, 2021 @ 4:22PM
గణ తంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం కావడం కలకలం రేపింది. ర్యాలీలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయనే ఆరోపణలు వచ్చాయి. దేశ ప్రతిష్టకు భంగం కల్గిందనే ఆందోళన జనాల నుంచి వ్యక్తమవుతోంది. కేంద్ర సర్కార్ తీరుపైనా పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అల్లర్లకు సంబంధించి మరో విషయం వెలుగులోనికి వచ్చింది. ట్రాక్టర్ ర్యాలీ తర్వాత వంద మంది రైతులు కనిపించకుండా పోయారని ఓ పంజాబ్ ఎన్జీఓ సంస్థ ఆరోపించింది.
ఈ వంద మందీ పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారని ‘పంజాబ్ మానవ హక్కుల వేదిక’ తెలిపింది. 12 మంది పంజాబ్‌లో ‘టాటారివాలా’ ప్రాంతానికి చెందిన వారూ ఉన్నారని ఆ సంస్థ వెల్లడించింది. హింసతో సంబంధమున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. దీంతో మిస్సైన వంద మంది రైతులు ఎక్కడున్నారన్నది మిస్టరీగా మారింది. పోలీసులు తీసుకెళ్లి ఉంటారనే పంజాబ్ రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసపై ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం చారిత్రక కట్టడం ఎర్రకోటను సందర్శించింది. ఎర్రకోట వద్ద విధ్వంసానికి దిగడాన్నిదేశ వ్యతిరేక చర్యగా ఢిల్లీ పోలీసులు అభివర్ణించారు. ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న హింసపై ఏమైనా ఆధారాలుంటే తమతో షేర్ చేసుకోవాలని ప్రజలను కోరారు. ట్రాక్టర్ ర్యాలీకోసం నిర్దేశించిన మార్గాల్లో కాకుండా వేలాది మంది ఆందోళనకారులు వేరే మార్గాల ద్వారా ఎర్రకోటలోకి చొరబడేందుకు ప్రయత్నించడంతో పోలీసులు, రైతుల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల జరిగిన దాడుల్లో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. కొందరు వ్యక్తులు ఏకంగా ఎర్రకొట్టలోకి ప్రవేశించి జెండా ఎగురవేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిరసనకారులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.