కరోనా కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్.... మళ్ళీ లాక్ డౌన్ దిశగా భారత్..!
posted on Dec 23, 2020 @ 4:56PM
బ్రిటన్ లో కరోనా రూపాంతరం చెంది మరింత వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెపుతున్న నేపధ్యంలో వివిధ ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇదే సమయంలో భారత్ కూడా అప్రమత్తమై తక్షణమే అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులలో బ్రిటన్ తదితర దేశాల నుండి వస్తున్న ప్రతి ఒక్కరికి ఆర్టీపిసిఆర్ టెస్టులు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఒకపక్క పండుగ సీజన్, మరోపక్క చలికాలం దృష్ట్యా దేశంలోని పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మన దేశంలోని ఒక్కో రాష్ట్రం మెల్లమెల్లగా మళ్ళీ రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంటున్నాయి.
ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తుండగా… తాజాగా కర్ణాటకలో కూడా రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి 10గంటల నుండి ఉదయం 6గంటల వరకు అత్యవసర సర్వీసులు మినహా అన్నింటికి కర్ఫ్యూ షరతులు వర్తిస్తాయని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. నైట్ కర్ఫ్యూకి రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు. మరోవైపు కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి ఫంక్షన్లను, ఈవెంట్లను అనుమతించబోమని అన్నారు. క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ పై కూడా దీని ప్రభావం పడుతుందని తెలిపారు.
తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఇప్పటికే బ్రిటన్ నుండి వచ్చిన వారి వివరాలు ట్రాక్ చేస్తున్నాయి. అయితే ఈ రాష్ట్రాలలో ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆంక్షలు విధించకపోయినప్పటికీ వచ్చే రెండు వారాలు అలర్ట్ గా హెచ్చరికలు వస్తుండడంతో మళ్లీ లాక్ డౌన్ వైపు అడుగులు వేస్తారా నే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.