భారత్ లో వచ్చే వారమే కరోనా టీకా? ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు గ్రీన్ సిగ్నల్
posted on Dec 24, 2020 9:27AM
ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు రూపు మార్చుకుని మరింతగా విరుచుకుపడుతోంది. దక్షిణాఫ్రికా, బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ తో దేశాలన్ని మళ్లీ భయం గుప్పిట్లోకి వెళ్లాయి. ఇప్పటికే చాలా దేశాలు రెండో సారి సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించాయి. కొన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణి ముమ్మరంగా సాగుతోంది. భారతీయులు కరోనా టీకా కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఇండియాలో కరోనా టీకా అందుబాటులోకి రాబోతుంది. అత్యవసర వినియోగం కింద తమ వ్యాక్సిన్‌కు అనుమతినివ్వాలని కోరడంతో.. టీకా రక్షణ, భద్రతకు సంబంధించి భారత వైద్యాధికారులు ఆస్ట్రాజెనెకా ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారని, వచ్చేవారం ఈ టీకాకు అత్యవసర అనుమతులు రావొచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు కేంద్రం పచ్చజెండా ఊపిందని , అత్యవసర వినియోగానికి వారంలో అనుమతి రానుందని తెలుస్తోంది. వచ్చే వారమే భారత్ లో కరోనా టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
అమెరికా, బ్రిటన్ లో ప్రస్తుతం ఫైజర్ టీకాను అక్కడి ప్రజలకు వేస్తున్నారు. అయితే ఫైజర్ టీకాను భద్రపరిచేందుకు మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. అందుకు తగ్గ వసతులు ఇండియాలో తక్కువగా ఉండటంతో కేంద్రం ఆక్స్‌ఫర్డ్ టీకా వైపునకు చూస్తోందని చెబుతున్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నది. దీని ధర డోసుకు రూ.250 వరకు ఉంటుందని అంచనా. సాధారణ ఫ్రిజ్‌లో కూడా దీనిని సుదీర్ఘకాలం భద్రపరిచే వీలుంది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్‌లో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్న వలంటీర్లపై టీకా 62 శాతం సమర్థమంతంగా పనిచేయగా, ఒకటిన్నర డోసు తీసుకున్న వలంటీర్లపై టీకా 90 శాతం సమర్థమంతంగా పనిచేసింది. అయితే కేంద్రం ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులను ఇస్తే, రెండు డోసుల టీకా వినియోగానికి సిద్ధపడుతుందా? లేక ఒకటిన్నర డోసుకు సానుకూలంగా ఉంటుందా? అనే చర్చ తెరపైకి వస్తున్నది. వ్యాక్సిన్ రెండు డోసుల వినియోగానికే కేంద్రం మొగ్గు చూపవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాకు అత్యవసర వినియోగం కింద వచ్చే వారం కేంద్రం అనుమతులు మంజూరు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయని చెబుతున్నారు. వ్యాక్సిన్ వచ్చాకా దేశ వ్యాప్తంగా పంపిణి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కేంద్రం గైడ్ లైన్స్ లో రాష్ట్రాలు కూడా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగానే ఉన్నాయి.