కరోనాను జయించిన న్యూజిలాండ్.. యాక్టివ్ కేసులు జీరో!
posted on Jun 8, 2020 @ 12:14PM
కరోనాను అరికట్టడానికి ప్రపంచ దేశాలు నానా పాట్లు పడుతున్న వేళ.. న్యూజిలాండ్ మాత్రం కరోనాను జయించిన దేశంగా అవతరించింది. తమ దేశంలో చివరి కరోనా పేషంట్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ ప్రకటించారు. ఆక్లాండ్‌కు చెందిన కరోనా బాధిత మహిళ సెయింట్ మార్గరెట్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడంతో.. ఇప్పుడు ఆ దేశంలో కరోనా యాక్టివ్ కేసులు జీరో అయ్యాయి.
ఫిబ్రవరి 28న న్యూజిలాండ్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఫిబ్రవరి 28 నుండి మే 22 వరకూ 1504 కేసులు నమోదు కాగా, మే 22 తర్వాత కొత్త కేసులు నమోదు కాలేదు. చివరి కరోనా పేషెంట్ తాజాగా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో, ఇప్పటివరకూ మొత్తం 22 మంది చనిపోగా, 1482 మంది రికవరీ అయ్యారు. ఫలితంగా ఇప్పుడా దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. అమెరికాతో సహా ఎన్నో అగ్ర దేశాలు కరోనా నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్న వేళ.. న్యూజిలాండ్ సాధించింది గొప్ప విజయమే అని చెప్పాలి.
ప్రపంచంలో లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా అమలుచేసిన దేశాల్లో న్యూజిలాండ్ ముందు వరుసలో ఉంది. అందుకే, ఇప్పుడా దేశం కరోనా నుంచి పూర్తిగా ఫ్రీ అయిపోయింది. ఇళ్ల నుంచి ఎవ్వర్నీ బయటకు రానివ్వలేదు. అత్యవసర, నిత్యవసరాలకు మాత్రమే బయటకు పంపారు. అది కూడా పూర్తీ జాగ్రత్తలు పాటించారు. దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యం లోకి కూరుకుపోయినా పర్వాలేదన్న అక్కడి ప్రధాని.. ఒక్కసారి కరోనా వెళ్లిపోతే మళ్లీ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని, అందుకోసం అందరం కలిసి గట్టిగా ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు. అటు ప్రధాని, ఇటు ప్రజలు కలిసి ఉక్కు సంకల్పంతో కరోనాను జయించారు.