ఉత్తరాఖండ్ కు మరో గండం! రిషిగంగలో కొత్త సరస్సు
posted on Feb 13, 2021 @ 4:03PM
మంచు విలయానికి కకా వికలమైంది ఉత్తరాఖండ్. మంచు కొండలు విరిగి పడడంతో ధౌలిగంగా నది పొంగింది. విద్యుత్ ప్రాజెక్టులను ముంచేసింది. వందలాది మందిని పొట్టన పెట్టుకుంది. మంచు కొండల్లో ఇప్పటికీ సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ విపత్తను మర్చిపోకముందే మరో డేంజర్ సిగ్నల్ వచ్చేసింది. ఉత్తరాఖండ్ కు మరో గండం ముంచుకొస్తుందని తెలుస్తోంది. గత ఆదివారం మంచు చరియలు విరిగిపడిన చోట ఓ కొత్త సరస్సు పుట్టుకొచ్చింది. రోజురోజుకు అది విస్తరిస్తోంది. రిషిగంగ వద్ద సముద్ర మట్టానికి 2,838 మీటర్ల ఎత్తున ఆ సరస్సు ఏర్పడినట్టు అధికారులు, శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఎన్డీఆర్ఎఫ్, డీఆర్డీవోల ఉపగ్రహ చిత్రాల ద్వారా అది ప్రమాదం తర్వాత కొత్తగా ఏర్పడిన సరస్సే అని తేలింది.
రిషిగంగ దగ్గర కొత్తగా సరస్సు ఏర్పడిన ప్రాంతాన్నీ డీఆర్డీవో శాస్త్రవేత్తలు పరిశీలించి వచ్చారు. ఇప్పటిదాకా అక్కడ 7 లక్షల ఘనపు మీటర్ల మేర.. అంటే దాదాపు 70 కోట్ల లీటర్లు నీరు వచ్చి చేరినట్టు చెబుతున్నారు. 350 మీటర్ల పొడవున్న ఈ సరస్సు.. మూడు ఫుట్ బాల్ మైదానాల పరిమాణంలో ఉన్నట్టు గుర్తించారు. సహజంగా ఏర్పడిన ఈ డ్యామ్ లోతు దాదాపు 60 మీటర్లుందని అంచనా వేశారు.
ప్రస్తుతం దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినా... మున్ముందు మాత్రం మరిన్ని వరదలు వచ్చే ముప్పుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
మంచు కొండలు విరిగి పడిన చోట సరస్సు ఏర్పడినట్టు గురువారమే హేమవతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ వీడియోను విడుదల చేశారు. అయితే అది కొత్తగా ఏర్పడిన సరస్సు అని ఇప్పుడే చెప్పలేమని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ వర్సిటీ తెలిపింది. తాజాగా వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ ఉపగ్రహ చిత్రాలు ద్వారా ఆ సరస్సు కొత్తగా ఏర్పడిందేనని నిర్దారించారు. డీఆర్డీవో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర జలసంఘానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా సీడబ్ల్యూసీ అక్కడ వరదల పరిస్థితిపై అంచనా వేస్తోంది.
వరద వస్తే ఎంత సేపట్లో వస్తుంది? జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎంత సమయం పడుతుంది? వంటి వివరాలతో కేంద్ర జల సంఘం అధికారులు లెక్కలు వేస్తున్నారు. సరస్సు ఎత్తు, పరిమాణం ఆధారంగా సెకనుకు 8.9 లక్షల లీటర్ల నీళ్లు సరస్సు నుంచి వచ్చే అవకాశం ఉందని తేలారు. అలా అయితే రెండున్నర కిలోమీటర్ల దూరాన్ని 9 నిమిషాల్లోనే నీళ్లు చేరతాయని , జోషిమఠ్ కు రావడానికి 53 నిమిషాలు పడుతుందని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు.