12 ఏండ్లకే కాలేజీలో చేరావా! చిరంజీవిపై నెటిజన్ల ఫైర్
posted on Mar 11, 2021 @ 12:52PM
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలు అన్నీ విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగానే సాగుతున్నాయి.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కచ్చితంగా 100% ప్రైవేటీకరణ చేసి తీరుతామని పార్లమెంట్ వేదికగా ప్రకటించడంతో.. ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. ఇంత జరుగుతున్నా టాలీవుడ్ హీరోలు సైతం ఎవరూ మాట్లాడక పోవడం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ నుంచి నారా రోహిత్ ఒక్కరే ఇలా చేయడం అన్యాయమని గళం విప్పారు. అయితే ఆయన చంద్రబాబు సోదరుడి కుమారుడు కావడంతో ఆయనకు కూడా పార్టీ ముద్ర వేశారు.
బుధవారం సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతున్నాయని చెప్పారు. నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతపట్టి.. గోడల మీద 'విశాఖ ఉక్కు సాధిస్తాం' అనే నినాదాన్ని రాశామని తెలిపారు. ధర్నాలు, హర్తాళ్లు, రిలే నిరాహార దీక్షలు చేశామని చెప్పారు.
అయితే విశాఖ పోరాటానికి మద్దతు ఇస్తూ చిరంజీవి చేసిన ప్రకటనపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతపట్టి.. గోడల మీద 'విశాఖ ఉక్కు సాధిస్తాం' అనే నినాదాన్ని రాశామని చెప్పడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మెగాస్టార్.. నర్సాపురం YNM కాలేజ్ లో చదివేటప్పుడు స్టీల్ ప్లాంట్ కావాలని గోడల మీద కుంచలతో రాశావా? , నిరాహార దీక్షలు కూడా చెయ్యడం చూశావా?.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం 1966-67 లో వచ్చింది.వైజాగ్ స్టీలు ప్లాంట్ స్థాపించింది 1971లో..కానీ నువ్వు YNM కాలేజ్ లో చదివింది 1973-76.ఆల్రెడి వచ్చేసిన స్టీల్ ప్లాంట్ కావాలని రెండేళ్ళ తర్వాత గోడల మీద రాశావా? దేశానికి స్వాతంత్ర్యం కావాలని క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపివ్వలేకపోయావా... అబద్దం చెప్పినా అమెజాన్ లో ఆఫర్ పెట్టినట్లు వుండాలి..అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
చిరంజీవి 1955లో జన్మించారు. విశాఖ ఉద్యమం జరిగింది 1966-67లో. అంటే అప్పటికి చిరంజీవి వయసు 12 ఏండ్లు. అప్పుడు చిరంజీవి ఆరో, ఏడో తరగతి చదువుతూ ఉంటారు. కాని చిరంజీవి మాత్రం వైఎన్ఎం కాలేజీలో చదువుతున్నప్పుడు.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గోడలపై నినాదాలు రాశామని చెప్పారు. దీనిపైనే నెటిజన్లు మండిపడుతున్నరు. 12 ఏండ్ల వయసులోనే చిరంజీవి వైఎన్ఎం కాలేజీలో చేరారా అని ప్రశ్నిస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా చిరంజీవి స్పందన వెనుక బలమైన కారణం ఉందని అంటున్నారు. విశాఖ ఉద్యమం మీద స్పందిస్తూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని అవసరమైతే విశాఖ వెళ్లి మరీ టిఆర్ఎస్ ఆందోళనల్లో పాల్గొంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మీద మరింత ప్రెజర్ పెరిగింది. దీంతో చిరంజీవి దీనికి సంబంధించిన ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. కేటీఆర్ ప్రకటన చేశాక చిరంజీవి ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.