ఉక్కు సపోర్టుకో లెక్కుంది.. కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్..
posted on Mar 11, 2021 @ 12:31PM
విశాఖ ఉక్కు పోరాటానికి టీఆర్ఎస్ మద్దతు. అవసరమైతే తాను కూడా ఉద్యమంలో పాల్గొంటానన్న కేటీఆర్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల రోజులుగా పోరాడుతున్నారు ఆంధ్ర ప్రజలు. ఇన్ని రోజులూ లేనిది సడెన్ గా ఇప్పుడే కేటీఆర్ లో విశాఖ ఉక్కు మీద అంత ప్రేమ ఎందుకొచ్చిందనే డౌట్ కొందరికి వచ్చింది. కేసీఆర్ అనుమతితో కేటీఆరే స్వయంగా ఉక్కు ఉద్యమంలో పాల్గొనేంత చొరవ ఎందుకు తీసుకుంటున్నారంటే.. దానికో లెక్కుంది అంటున్నారు రేవంత్ రెడ్డి.
విశాఖ ఉక్కు పోరాటానికి కేటీఆర్ మద్దతు ఇవ్వడం వెనుక దురుద్దేశం ఉందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది కోసమే అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారన్నారు. ఆ మేరకు మంత్రి కేటీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధికోసమే ఈ ఎత్తుగడ వేశారు. విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాడరు కానీ విశాఖ ఉక్కు కోసం పోరాడతారా? మీ ఎంపీలు పార్లమెంటులో పోరాడరు. మీరు జంతర్ మంతర్ వద్ద దీక్షకు కూడా రారు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు హక్కుల గురించి గొంతు చించుకోవడం మాత్రం వచ్చా? ఎన్నికలయ్యాక ఇచ్చిన హామీలను మరచిపోవడం మీకు మీ పార్టీకి అలవాటుగా మారింది. పెరిగిన నిత్యవసరాలు, గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలపై పార్లమెంట్‌లో పోరాటానికి మీ ఎంపీలు ముఖం చాటేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే భయపడుతున్నారా? రాజీ పడుతున్నారా?’ అని రేవంత్ లేఖలో ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి లేఖతో ప్రజల్లో అనుమానం మొదలైంది. గతంలో ఏపీ రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేసినప్పుడు స్పందించలేదు. స్పెషల్ స్టేటస్, విశాఖ రైల్వే జోన్ పైనా పైనా నో రియాక్షన్. అలాంటిది.. నెల రోజుల తర్వాత ఉన్నట్టుండి విశాఖ ఉక్కు ఉద్యమానికి టీఆర్ఎస్ తరఫున కేటీఆర్ మద్దతు ప్రకటించడమేంటని ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాభం పొందడానికే ఇలాంటి ప్రకటన చేశారనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. ఎందుకంటే, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ హోరాహోరీగా ఉంది. టీఆర్ఎస్ నుంచి పీవీ కుమార్తె వాణీదేవిని ఆలస్యంగా బరిలో దింపినా.. కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతో వాణీదేవి పట్ట ఓటర్లు అంత సుముఖంగా లేరని అంటున్నారు. బీజేపీ నుంచి రాంచందర్ రావు, కాంగ్రెస్ కేండిడేట్ చిన్నారెడ్డి, ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన ప్రొ.నాగేశ్వర్‌ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. బలమైన పోటీతో వాణీదేవి విజయంపై గులాబీ పార్టీలో ఆందోళన నెలకొంది. అందుకే, వ్యూహాత్మకంగా విశాఖ ఉక్కు పోరాటానికి కేటీఆర్ మద్దతు ఇచ్చారని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో సెటిలర్స్ ఓట్లే టార్గెట్ గా కేటీఆర్ ఈ స్టేట్‌మెంట్ చేశారని చెబుతున్నారు. ఆంధ్రులు సెంటిమెంట్‌గా భావిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సపోర్ట్‌గా మాట్లాడటం వల్ల అక్కడి వారిని సంతృప్తి పరిచి.. తద్వారా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న ఓ వర్గం ఓట్లను గంపగుత్తగా ఆకర్షించాలనే ఐడియాతోనే కేటీఆర్ ఆ స్టేట్‌మెంట్ చేశారని విశ్లేషిస్తున్నారు. తాజాగా, కేటీఆర్ కు రేవంత్ రెడ్డి రాసిన లేఖలోనూ ఇదే విషయం ప్రస్తావించారు.
ఇదే పార్లమెంట్ సెషన్ లో.. కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయలేమంటూ కేంద్రం ప్రకటన చేసింది. ఉత్తర తెలంగాణవాసులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై కేంద్రం చేతులెత్తేసినా.. కేటీఆర్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. హైదరాబాద్ కు ఐటీఐఆర్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, విభజన హామీలు తదితర తెలంగాణకు చెందిన అంశాలపై ఉద్యమం చేయకుండా ఉదాసీనంగా ఉంటున్న టీఆర్ఎస్.. ఎవరూ అడగందే విశాఖ ఉక్కు కోసం తాము సైతం కలిసి పోరాటం చేస్తామంటూ ప్రకటనలు చేయడం ప్రజలను మభ్యపరచడమే అని విమర్శిస్తున్నాయి విపక్షాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేటీఆర్ ఇలా ఉక్కు స్టేట్‌మెంట్ చేశారనేది రేవంత్‌రెడ్డి లేఖ సారాంశం.