ప్రముఖ రచయిత్రి నాయని కృష్ణకుమారి కన్నుమూత
posted on Jan 30, 2016 @ 12:08PM
తెలుగు సాహిత్యానికి నేడు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. జీవితాన్ని ఆసాంతం రచనలకే అంకితం చేసిన ప్రముఖ రచయిత్రి నాయని కృష్ణకుమారి (86) నేడు కన్నుమూశారు. ప్రముఖ కవి నాయని సుబ్బారావు కుమార్తె అయిన కృష్ణకుమారి చిన్ననాటి నుంచే రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి కనబరిచేవారు. 18 ఏళ్ల అతి పిన్న వయసులోనే ‘ఆంధ్రుల కథ’ పేరిట ఆంధ్రుల చరిత్రను రాశారు. అప్పట్లో ఆ పుస్తకాన్ని పాఠ్యపుస్తకంగా నిర్దేశించింది ప్రభుత్వం. తెలుగులో ఉన్నత విద్యను పూర్తిచేసుకున్న తరువాత హైదరాబాదులో స్థిరపడ్డారు కృష్ణకుమారి. అంచెలంచెలుగా తెలుగు పథంలో ఎదుగుతూ తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పదవీ విరమణ చేశారు. కథలు, కవితలు, వ్యాసాలు, సాహితీ విమర్శలు… ఇలా కృష్ణకుమారిగారు అన్ని సాహితీ ప్రక్రియలలోనూ రాణించారు. జానపద సాహిత్యం మీద సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి పి.హెచ్.డి. పట్టాను సైతం సాధించారు. తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసిన కృష్ణకుమారి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు.