మోడీని రాహుల్ అందుకే టార్గెట్ చేసుకొంటున్నారా?
posted on May 29, 2015 @ 1:29PM
మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీతో గంటసేపు సమావేశమవడంపై రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఆయన రాజకీయ అపరిపక్వతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పుతోందని డా. మన్మోహన్ సింగ్ హెచ్చరించగానే కంగారుపడిన ప్రధాని మోడీ తక్షణమే ఆయనను తన నివాసానికి ఆహ్వానించి ఆయన చేత పాఠాలు చెప్పించుకొన్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేసారు.
డా.మన్మోహన్ సింగ్ మంచి ఆర్ధికనిపుణుడనే విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానంలేదు. కానీ అంతటి వాడిని కూడా తల్లీకొడుకులు కలిసి ఒక డమ్మీగా చేసి దేశాన్ని ఏవిధంగా భ్రష్టు పట్టించారో, అందుకు వారికి ప్రజలు ఏవిధంగా గుణపాఠం చెప్పారో రాహుల్ గాంధీ కూడా తెలుసు. అంత గొప్ప మేధావి సేవలు ఉపయోగించుకొని దేశాన్ని ప్రగతి పధంలో నడిపించకపోగా, అటువంటి మచ్చలేని నిజాయితీపరుడుకి కూడా బొగ్గు మసి అంటించింది ఎవరు? చివరికి కొన్ని విదేశీ పత్రికలలో సైతం ఆయన ‘అత్యంత అసమర్ధ ప్రధానమంత్రి’ అని హెడ్డింగ్ పెట్టి కవర్ పేజీ కధనాలు ప్రచురించాయంటే దానికి ఎవరిని నిందించాలి?
ప్రధాని నరేంద్ర మోడీ డా.మన్మోహన్ సింగ్ అంత గొప్ప చదువులు చదువుకొని ఉండకపోవచ్చును. కానీ కేవలం ఏడాది కాలంలోనే దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టగలిగారని స్వదేశంలోనే కాదు విదేశీ ఆర్ధిక నిపుణులు సైతం మెచ్చుకొంటున్న సంగతి కూడా రాహుల్ గాంధీకి తెలియకపోతే ఆయన లోకజ్ఞానం ఎంతగొప్పగా ఉందో అర్ధమవుతుంది.
కేవలం నెహ్రూ కుటుంబానికి చెందినందునే కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షపదవిలో, కుదిరితే ప్రధాని కుర్చీలో కూడా కూర్చోవాలనుకొన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ రక్తంలోనే ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక తమ పార్టీలో కనిపిస్తున్న క్రమాశిక్షణా రాహిత్యాన్నే ప్రజాస్వామ్యమని చెప్పుకోవడం కూడా ఆయనకే చెల్లు. తమ పార్టీలో ఏవిషయంపైనైనా అందరూ కలిసి కూర్చొని నిర్భీతిగా చర్చించగలరని రాహుల్ గాంధీ చెప్పుకోవడమూ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సాక్షాత్ డా.మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసిన ప్రజా ప్రతినిధుల చట్టం నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు...దానిని చెత్త బుట్టలో పడేయాల్సిందేనని రాహుల్ గాంధీ ఆయనను ఏవిధంగా అవమానించారో, ఆ తరువాత ఆ చట్టాన్నినిజంగానే చట్టబుట్టలో పడేయడం గురించి కూడా ప్రజలందరికీ తెలుసు. తమ ప్రభుత్వమే చేసిన చట్టాన్ని ఏ అధికారంతో ఆయన నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదని తీసిపడేసారు? అని ప్రశ్నకు బహుశః ఆయన వద్ద సమాధానం ఉండకపోవచ్చును.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కూడా ఆ తల్లి కొడుకుల పుణ్యమాని రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ, దానితో బాటు అనేకమంది నేతలు ఏవిధంగా బలయిపోయారో అందరికీ తెలుసు. ఒకపక్క కాంగ్రెస్ పార్టీ మీద కర్రపెత్తనం చేస్తూనే మళ్ళీ మోడీ కర్ర పెత్తనం చేస్తున్నారంటూ విమర్శించడం చాలా హాస్యాస్పదం.
కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు నిత్యం మోడీని టార్గెట్ చేసుకొని ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? అని ఆలోచిస్తే దానికి చాలా ఆశ్చర్యకరమయిన కారణాలు కనబడతాయి. కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలు ఆయన నాయకత్వ శక్తిని, లక్షణాలను అనుమానిస్తూ, పార్టీ పగ్గాలు వేరెవరికయినా అప్పగించాలని కోరుతున్న సంగతి అందరికీ తెలిసిందే. బహుశః మోడీని విమర్శిస్తుండటం వలన తాను మోడీకి ఏమాత్రం తీసిపోనని, తనలోని ఆయనకున్న నాయకత్వ లక్షణాలన్నీ ఉన్నాయని కనుక కాంగ్రెస్ పార్టీ అద్యక్షపదవిని చెప్పట్టేందుకు తనే అన్ని విధాల అర్హుడనని నిరూపించుకొనే ప్రయత్నంలోనే ఆయన మోడీని విమర్శిస్తున్నారేమో? అనే అనుమానాలు కలుగుతున్నాయి మోడీని విమర్శించడం ద్వారా ఆయన తన స్థాయి పెరుగుతుందనుకొంటే అది భ్రమ మాత్రమే. పైగా తన స్థాయిని పెంచుకోవడానికి రాహుల్ గాంధీ అటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రజలు కూడా నవ్వుకొంటారు.