సీఎం జగన్ మిస్సింగ్! ఏపీలో పొలిటికల్ హీట్..
posted on May 10, 2021 @ 3:31PM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కరోనా వైరస్ కు పోటీగా రాజకీయ వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా కట్టడి అంశంలో అధికార, విపక్షాల మధ్య యుద్ధమే సాగుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యక్తిగత దూషణలతో లీడర్లు కాక రేపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనా విజృంభిస్తున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి.
కరోనాతో రోగులు అల్లాడుతున్నా ప్రభుత్వం పత్తా లేకుండా పోయిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. చికిత్స అందక, ఆక్సిజన్ లేక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారని చెబుతున్నారు. కరోనా కేసులు, మరణాల లెక్కల్లో తేడాలున్నాయని, కరోనా వేరియంట్ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ మండిపడుతోంది. ఇది కచ్చితంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని.. కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేననేది ఆరోపిస్తోంది. తాజాగా సీఎం జగన్ కనిపించడం లేదంటూ ట్వీట్ చేసి వాతావరణాన్ని మరింత వేడెక్కించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
“కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో గర్భిణి, కడుపులో బిడ్డ కూడా మృతి చెందింది. చేతగాని సీఎం వైఎస్ జగన్ వలనే ఇలాంటి హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా తాడేపల్లి నీరో చక్రవర్తి గడప దాటడం లేదు. జనానికి నేనున్నాను అని హామీ ఇచ్చి నేడు కనిపించకుండా పోయాడు. నేను విన్నాను అని అరిచి చెప్పిన జగన్ రెడ్డి, రాష్ట్రంలో కరోనాతో మరణిస్తున్న వారి ఆర్తనాదాలు వినిపించుకోవడం లేదు.” అని లోకేష్ ట్వీట్ చేశారు.
రచ్చబండ పేరుతో సీఎం జగన్, ప్రభుత్వంపై, వైసీపీ నేతలపై మండిపడుతున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు... సీఎం జగన్ కనిపించడం లేదన్నారు. చివరిసారిగా తాడేపల్లిలో కనిపించారని.. ఆ తర్వాత ఆచూకీ లేదని ఎద్దేవా చేశారు. పాదయాత్ర సమయంలోనే ప్రజలకు దర్శనమిచ్చిన ముఖ్యమంత్రి.. ఆ తర్వాత కనిపించకుండా పోయారని.. ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అని చెప్పిన సీఎం ఇప్పుడెక్కడని ప్రశ్నించారు. ఇక తనపై కుట్ర చేసి మరీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా విభాగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారని రఘురామ అన్నారు. అలాగే అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన.. తానేమీ భయపడనని ఆయన స్పష్టం చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రఘురామ కృష్ణం రాజు తెలిపారు.