నంద్యాలలో మరో సెల్ఫీ వీడియో కలకలం
posted on Nov 10, 2020 9:01AM
పోలీసుల వేధింపులు భరించలేక నంద్యాలకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన మరిచిపోక ముందే.. తాజాగా మరో సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం.. సూరజ్ అనే కాంట్రాక్టర్ రెండు నెలల క్రితం ఒక ఎలక్ట్రికల్ వర్క్ కోసం టెండర్ వేశాడు. అయితే, ఆ టెండర్ ను రద్దు చేయకుండానే ఆ కాంట్రాక్టును నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిశోర్‌రెడ్డి ఒంగోలుకు చెందిన మాధవరావు అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇప్పించినట్టు సూరజ్ ఆ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. దీంతో తాము ఏపీ హైకోర్టుకు వెళ్లి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకున్నా ఫలితం లేకపోయిందని, ఎమ్మెల్యే చెప్పిన వారికే అధికారులు ఆ కాంట్రాక్ట్‌ను అప్పగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఎమ్మెల్యే శిల్పా రవిని తన తండ్రి తిట్టినట్టు ప్రచారం చేస్తున్నారని, అయితే ఇందులో అసలు ఎటువంటి వాస్తవం లేదని, తిట్టినట్టు నిరూపించాలని సూరజ్ కుమారుడు ప్రస్తుతం డిమాండ్ చేశాడు. నంద్యాల ఎమ్మెల్యే చేసిన పనివల్ల తమ కుటుంబం మొత్తం రోడ్డునపడిందని, దీంతో తమకు చావాలో, బతకాలో అర్థం కావడం లేదని అతడు వాపోయాడు.