రచ్చకెక్కిన నందమూరి వారు

 

తెలుగు జాతి ఆత్మ గౌరవం, తెలుగు కీర్తీ దశదిశలా వ్యాపింపజేసిన మహానుబావుడు స్వర్గీయ నందమురి తారక రామారావు. ఆయనని ఒక గొప్ప నటుడిగా కొందరు ప్రేమిస్తే, గొప్ప రాజకీయ నాయకుడిగా మరికొందరు గౌరవిస్తారు. ఆయనని నేటికీ శ్రీకృష్ణుడి ప్రతిరూపంగా భావించి, పూజించేవారికి ఈ రాష్ట్రంలో కొదవలేదు. తెలుగు బాషాప్రియులకు ఆయనొక మూర్తీభవించిన తెలుగు బాషా స్వరూపం. అంతగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహనీయుడికి, నేడు అయన వారసులమని చెప్పుకొనేవారే ‘పార్లమెంటులో ఆయన విగ్రహం’ నెలకొల్పే విషయంలో ఒకరిమీద మరొకరు బురద జల్లుకొంటూ నీచరాజకీయాలు చేస్తూ ఘోరఅవమానం చేస్తున్నారు. తమ కుటుంబ గౌరవ ప్రతిష్టలే కాక, ఆ మహనీయుడి పరువుకూడా గంగలో కలుపుతున్నందుకు తెలుగు ప్రజలు ఎంత బాధ పడుతున్నారో, వారెవరికి పట్టకపోవడం విచిత్రం.

 

నందమూరి కుటుంబంలో ఎన్ని లుకలుకలు ఉన్నాయో ఈ ఒక్క ఉదంతంతో బయట పడుతున్నాయి. కుటుంబసభ్యులే వారిలోవారు ముటాలు కట్టుకొని ఒకరి మీద మరొకరు బురద జల్లుకొంటూ బహిరంగ లేఖలంటూ బజారుకకెక్కుతుంటే చూసిన వారు ముక్కున వేలేసుకోవలసివస్తోంది. అటువంటి గొప్ప మనిషి కడుపున పుట్టిన వారందరూ, ఆయన విగ్రహం నెలకొల్పకపోయినా ఎవరూ వేలెత్తి చూపరు. గానీ, ఇలాగ ఆయన పరువు, తమ కుటుంబ పరువు బజారుకీడ్చకుంటే అంతే చాలనుకొంటున్నారు.

 

నందమూరివారి కుమార్తె పురంద్రేస్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు, బాలకృష్ణ, శ్రీమతి లక్ష్మీ పార్వతి మొదలుకొని తెలుగు దేశం నేతల వరకు ప్రతీ ఒక్కరు ఈ విషయంలో అనవసరమయిన రబస చేస్తూనే ఉన్నారు. ఇంతజరిగినా ఎవరిలోకూడా బాధ, పశ్చాతాపం వంటివి కానరాలేదు. ఇప్పటికయినా, ఎవరో ఒకరు వెనక్కితగ్గి కుటుంబ పరువు, ప్రతిష్టలు నిలుపుకొందామని ఎవరు అనుకున్నట్లు కనబడలేదు. అందరికీ ఆ మహనీయుడి విగ్రహం అడ్డం పెట్టుకొని రాజకీయం చేసుకోవడానికే ఆసక్తి తప్ప, ఆ ప్రయత్నంలో ప్రజలముందు తామెంత చులకన అవుతామో ఎవరు ఆలోచించినట్లు లేదు.

 

ప్రజలు వారిని కోరేదేమిదేమిటంటే అయనకి బంగారు విగ్రహం పెట్టనవసరం లేదు. ఏ భారతరత్నో మరోటో తమ పలుకుబడి ఉపయోగించి ఆయనకీ ఇప్పించనవసరం లేదు. ప్రపంచ తెలుగు మహా సభలు జరగనున్నఈ తరుణంలో తెలుగు బాషా ప్రియుడిగా, తెలుగు ప్రజల అభిమాన నటుడిగా, వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన అయన పరువు తీయకుండా ఉంటె అంతే చాలు. ప్రజలో గుండెల్లో ఉన్న మహానీయులెవరికీ ఇటువంటి విగ్రహాలు, పురస్కారాలు అవసరం ఉండవు అని వారు తెలుసుకోవాలి.