జగన్ ఎత్తుకు నందమూరి వంశం చిత్తు
posted on Apr 8, 2013 @ 10:35PM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో తను పావుగా మారడం జూ.యన్టీఆర్ కు చాలా బాధ కలిగించింది. జరుగుతున్న సంఘటనలతో తన బాద్ షా సినిమా విజయాన్ని కూడా ఆస్వాదించలేని పరిస్థితిలో ఉన్నానని ఆయన అన్నారు. అనవసరమయిన వివాదాలలోకి తనను లాగి ఈ చిన్నపాటి ఆనందం కూడా తనకు దూరం చేయవద్దని ఆయన రాజకీయ నాయకులను కోరారు. ఆయన ఆ విధంగా కోరడం సబబుగానే ఉన్నపటికీ, ఇదే మాట బందరులో మొదటి ఫ్లెక్సీ వెలిసినప్పుడే అని ఉంటే పరిస్థితి ఇంత వరకువచ్చేది కాదు. కానీ, ఆతని మౌనమే ఇంత పెద్ద రగడకు దారి తీసిందని చెప్పకతప్పదు. పార్టీతో బేధాభిప్రాయాలు ఉన్నపటికీ, వాటిని పక్కన బెట్టి, తమ మధ్య చిచ్చుపెడుతున్న వైకాపాకు సరయిన జవాబు చెప్పి ఉండి ఉంటే సమస్య ఇంత తీవ్రతరం అయ్యేదికాదు. ఇక, నందమూరి కుటుంబ సభ్యులు అందరి మద్య నివురుగప్పిన నిప్పులా ఉన్నభేదాభిప్రాయాలు కూడా ఈ సందర్భంగా బయటపడ్డాయి. తమ వంశ ప్రతిష్ట దెబ్బతింటోందని అందరికీ తెలిసినప్పటికీ, మాట్లాడటం అనివార్యం అవడంతో అందరూ మాట్లాడి నలుగురిలో మరింత చులకన అయ్యేరు. తమ శత్రుపార్టీ విసిరిన ఒక చిన్న పాచికకే అందరూ బెంబేలు పడిపోవడానికి వారి అనైక్యతే కారణమని చెప్పక తప్పదు. నిత్యం నీతి సూత్రాలు వల్లించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తను అద్దాల మేడలో కూర్చొని ఎదుట పార్టీల మీదకు రాళ్ళు విసురుతున్నట్లు గ్రహిస్తే ఆ పార్టీకే మేలు.