బంద్ నిర్వహిస్తున్న వామపక్ష నేతల అరెస్ట్
posted on Apr 9, 2013 7:29AM
తెల్లవారు ఝామున నాలుగు గంటలనుండే నగరంలోని ఎం.జి.బి.ఎస్. అవుట్ గోయింగ్ గేటు వద్ద సిపీఐ, సిపియం, కార్యకర్తలు, బి.వి.రాఘవులు, నారాయణ ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల ఎదుట వామపక్షాలు, విపక్షాల కార్యకర్తలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. కడపజిల్లాలోని అన్ని బస్ డిపోల నుండి బస్సులు బయటకు రాలేదు. జిల్లాలోని వ్యాపారస్థులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. ఎం.జి.బి.ఎస్. ఎదుట నిరసన తెలుపుతున్న బి.వి.రాఘవులు, నారాయణ, వామపక్ష కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బి.వి. రాఘవులు మాట్లాడుతూ కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్ కు తమ మద్ధతు తెలిపి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో నిరసనలు తెలుపుతున్నారని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. నారాయణ మాట్లాడుతూ సి.ఎం. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లోని కళంకిత నేతలను ముందుగా అరెస్ట్ చేయాలని, తరువాతే తమను అరెస్ట్ చేయాలని, హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి పేరును సిబీఐ ఛార్జ్ షీట్ లో చేర్చిందని, ముందుగా పోలీసులు సబితా ఇంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలని, అసలు తమను అరెస్ట్ చేసే హక్కు సబితా ఇంద్రారెడ్డికి లేదని వ్యాఖ్యానించారు.