సాగర్ లో బీజేపీ సంచలనం.. జనరల్ సీటులో ఎస్టీ అభ్యర్థి
posted on Mar 29, 2021 @ 9:45PM
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పనుగోతు రవికుమార్ నాయక్ ను ఖరారు చేసింది. నాగార్జున సాగర్ జనరల్ నియోజకవర్గమైనా.. ఎస్టీని బరిలోకి దింపి పెద్ద సాహసమే చేసింది కమలదళం. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు గిరిజనులే ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 15 వేల మంది ఓటర్లు ఉండగా... అందులో దాదాపు 41 వేల మంది లంబాడీలే. తీవ్ర తర్జనభర్జనల తర్వాత రవి నాయక్ ను ఖరారు చేసినట్లు చెబుతున్నారు.
నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల భగత్ ఎంపికయ్యారు. ఆయనకు సోమవారం తెలంగాణ భవన్ లో బీఫామ్ అందించారు కేసీఆర్. టిఆర్ఎస్ టికెట్ ఆశించిన నేతలకు స్వయంగా హామీ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ రెడ్డికి ఇవ్వడం, టీఆర్ఎస్ బీసీకి ఇవ్వడంతో సామాజిక కోణంలో ఆలోచన చేసిన బీజేపీ.. నియోజకవర్గం ఎక్కువగా ఓటర్లున్న గిరిజనుల నుంచి రవి నాయక్ ను ఖరారు చేసిందని తెలుస్తోంది.
నాగార్జున సాగర్ బీజేపీ టికెట్ కోసం చాలా మంది ప్రయత్నించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదితా రెడ్డితో ఇంద్రాసేనారెడ్డి, కడారి అంజయ్య యాదవ్, రవి నాయక్ పోటీ పడ్డారు. ఇంద్రాసేనా రెడ్డి, రవి నాయక్ గతంలో జానారెడ్డికి ప్రధాన అనచరులుగా ఉన్నారు. కంకణాల నివేదితా రెడ్డి శనివారం నామినేషన్ కూడా వేశారు. దీంతో ఆమెకే టికెట్ ఖరారైందనే ప్రచారం జరిగింది. కాని సామాజిక కోణంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది బీజేపీ హైకమాండ్.