చంద్రబాబుకి దమ్ముందా? మైసూరా

 

నేతలు పార్టీలు మారగానే వారి విధేయతతో బాటు వారి స్వరం కూడా మారుతుంది. నిన్న మొన్నటివరకూ తెలుగుదేశం పార్టీలోనే నా చివరి శ్వాస, చంద్రబాబు వంటి నాయకుడు నభుతోన భవిష్యత్ అంటూ సినిమా డైలాగులు చెప్పిన మైసూరా రెడ్డి, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయగానే ఆయనకి చంద్రబాబు అకస్మాతుగా చెడ్డవాడయిపోయాడు.


కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ అనుచరులుగా ముద్రపడ్డ 9 మంది శాసనసభ్యులను బహిష్కరిస్తున్నట్లు పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించగానే, తమ అనుచరులను బయటకి గెంటుతున్నందుకు కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేయవలసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీతో యుద్ధం మొదలు పెట్టింది. “చంద్రబాబుకి దమ్ము దైర్యం ఉంటే, కాంగ్రెస్ పార్టీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీతో తమకి తెరవెనుక ఒప్పందాలు ఉన్నాయని ఒప్పుకోవాలని” మైసూరా రెడ్డి ఒక వింత డిమాండ్ చేసారు. నిన్నగాక మొన్న పుట్టిన తమ పార్టీ ఆదేశిస్తే మూడు దశాబ్దాలు చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ శిరసావహిస్తుందని అనుభవజ్ఞుడయిన ఆయన ఎలా అనుకోన్నారో తెలియదు.


కోటి సంతకాలతో జగన్ మోహన్ రెడ్డి ని జైలునుండి విడిపించుకోవచ్చుననే వింత ఆలోచన చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు “ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న మరోపార్టీ మీద, మూడో పార్టీ అడిగినప్పుడల్లా అవిశ్వాసం పెట్టకపోతే, ఆరెండు పార్టీలు కుమ్మక్కుఅయినట్లే” అనే మరో సరికొత్త రాజకీయ సిద్దాంతాన్ని మైసూర డిమాండుతో ఆవిష్కరించారు.


అసలు, తమ అనుచరులు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలోఉండి అక్కడ ఏమి చేస్తున్నారు? జగన్ మోహన్ రెడ్డికి విదేయులయినప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇంతకాలం ఎందుకు వ్రేలాడేరు? వారిని కాంగ్రెస్ ఇప్పుడు బయటకి పంపుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీని నిందించకపోగా తెలుగు దేశం పార్టీని మద్యలోకి ఎందుకు లాగుతున్నారు? అనే ప్రశ్నలకు మైసూరా వద్ద సమాధానలు ఉన్నాయో లేవో? ఆయనే చెప్పాలి మరి.