బొత్స పేర్లెందుకు ప్రకటించలేదంటే....

 

కాంగ్రెస్ పార్టీ నుండి 9 మంది శాసన సభ్యులను బహిష్కరిస్తున్నట్లు నిన్న బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనతో మళ్ళీ రాష్ట్రంలో రాజకీయలొక్కసారిగా వేడెక్కాయి. ఆయన 9మందిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినా వారి పేర్లు మాత్రం ప్రకటించలేదు.

 

బహుశః తెలంగాణా అంశం నుండి మీడియా దృష్టిని మరల్చడానికో లేక జగన్ వైపు చూస్తున్నకాంగ్రెస్ నేతలను అదుపులో పెట్టడానికో ఆయన అవిదమయిన ఎత్తుగడచేసి ఉంటారు. ఇక, ఎన్నికలు వస్తున్నతరుణంలో కాంగ్రెస్ పార్టీలో కోవర్టులా పనిచేస్తున్న జగన్ మోహన్ రెడ్డి అనుచరులను ఉంచుకోవడం పార్టీకి ప్రమాదం అనే ఆలోచనతో, అతనికి విదేయులయిన వారిని ఈ విదంగా డెడ్ లయిన్ ఇవ్వడం ద్వారా వారంతట వారే పార్టీ వీడిపోయేలా చేయడానికి ఆయన ఈవిదమయిన ప్రకటన చేసిఉంటారు. అదే సమయంలో, ఇంకా సందిగ్ధంలోఉన్నజగన్ అనుచరులకు పార్టీలోఉండటమా లేక వదిలి వెళ్లిపోవడమా అనే సంగతిని కూడా వెంటనే తేల్చుకొనేందుకు ఆయన ఆఖరి అవకాశం ఇస్తూ వారి పేర్లు ప్రకటించక కొంత సమయం ఇచ్చారని భావించవచ్చును.

 

కాంగ్రెస్ పార్టీ, తమని మెడ పట్టుకొని బయటకి గెంటితే ఆ కారణంతో ప్రజల నుండి సానుభూతి పొందవచ్చునని ఎదురు చూస్తున్నశాసన సభ్యులకి, ఈ ప్రకటనతో కొంత గందరగోళం ఏర్పడి వారంతట వారే బయటకు వస్తారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ఉపాయం మెల్లగా ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో జగన్ విధేయుడిగా పేరున్న జోగి రమేష్, బొత్స సత్యనారాయణపై విరుచుకుపడుతూ బయటపడటమే అందుకు చక్కని ఉదాహరణ. తద్వారా పార్టీలోంచి బయటకి వెళ్ళేవారు ఈవిధంగా తమ పరువు తామే తీసుకొని మరీ బయటకి వెళ్ళేలా చేయవచ్చును.

 

రాన్నున్న ఒకటి రెండు రోజుల్లో మరి కొంతమంది ఇదేవిధంగా బయటపడవచ్చును. అనర్హత వేటు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ నుండి బయటపడే కన్నా, ఆ పార్టీకి రాజీనామా చేయడమే ఉత్తమం అని భావించే మరి కొందరు కూడా త్వరలోనే బయట పడవచ్చును. ఒకవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇది మేలు చేసినా, ప్రభుత్వము కుప్పకూలే ప్రమాదం ఉంది. అయితే, ఆ సంగతి ఆలోచించకుండా బొత్స సత్యనారాయణ అటువంటి ప్రకటన చేసి ఉంటారంటే అనుమానమే