ఎస్.పి వ్యవస్థాపకుడు ములాయం సింగ్ ఇకలేరు
posted on Oct 10, 2022 @ 11:07AM
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ,యూపీ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గురుగ్రామ్ నగరంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములాయం సోమవారం (అక్టోబర్ 10) ఉదయం 8.30 గంటలకు మరణించారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అనారోగ్యంతో ఆగస్టు 22వ తేదీన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నమూలాయం ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. 1939 నవం బర్ 22వతేదీన యూపీలో జన్మించిన ములాయం యూపీ సీఎంగా మూడుసార్లు పని చేశారు. కేంద్ర రక్షణశాఖ మంత్రిగానూ పనిచేశారు. ములాయం మరణవార్త వినగానే ప్రముఖ రాజకీయనాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాళులు అర్పించారు. ఉత్తరప్రదేశ్‌లో, దేశ రాజకీయాల్లోనూ ములాయం సింగ్ ఎన్నదగ్గ రాజకీయవేత్త అని ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాప సందేశంలో తెలిపారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ఆయన చేసిన పోరాటం ఎంతో కీలకమని శ్లాఘించారు. రక్షణ మంత్రిగా ఎంతో సేవచేశారని, పార్లమెంటు సభ్యునిగా అనేక కీలకాంశాల్లో ఆయన ఆలోచనలు, సూచనలు ప్రజాహితంగా ఉన్నాయని ప్రధాని ట్వీట్ చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ రక్షణమంత్రి ములాయంసింగ్ యాదవ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తన ట్విటర్ హాండిల్‌లో సంతాపం ప్రకటించింది. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహాన ములాయం మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, మాజీ ముఖ్య మంత్రి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలుసు కున్నామని ఇంతలో ఈ విషాద వార్త వినవలసివస్తుందనుకోలేదని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ములాయం రాజకీయాల్లో ఎంతో కీలకపాత్ర పోషించారని శ్లాఘించారు.
ములాయం సింగ్ యాదవ్‌జీ మరణవార్త ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆయనతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని, సోదరుడిని కోల్పోయానని ఆయన ట్విట్ చేశారు. వెనుక బడిన తరగతుల మహానేతగా ఆయన ప్రజలకు ఎనలేని సేవలు చేశారని, ఆయనతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆయన గొప్ప స్పూర్తి ప్రదాత అంటూ శ్లాఘించారు. మృదుస్వభావి, సామాజిక న్యాయం కోసం పాటుబడుతూ లక్షలాదిమంది జీవితాలకు వెలుగునిచ్చిన మాస్ నాయకునిగా ఆయన ఎనలేని కీర్తి గడించారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భవగంతుడ్ని కోరుతున్నానన్నారు.