మల్లయోధుడే కాదు.. రాజకీయ దురంధరుడు ములాయం
posted on Oct 10, 2022 @ 11:27AM
స్వతంత్ర భారత రాజకీయాల్లో ముఖ్యంగా రెండవ తరం రాజకీయ నేతల్లో ప్రముఖునిగా నిలిచిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం(అక్టోబర్ 10) ఉదయం కన్ను మూశారు. సుమారు నెలన్నర రోజులుగా రోజులుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ములాయం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. అయన వయసు 82 ఏళ్ళు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మూడు పర్యాయాలు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఏడుసార్లు ఎంపీగా, పది సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కేంద్రమంత్రిగానూ సేవలందించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.
ములాయం సింగ్ యాదవ్ ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించినా, మల్ల యోధునిగా, రాజకీయ నేతగానే పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. సోషలిస్ట్ నేత రామమనోహర్ లోహియా అంతేవాసిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ములాయం సింగ్ యాదవ్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో సాగిన, ఎమర్జెన్సీ వ్యతిరేక ఆందోళనతో ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. నవంబర్ 22, 1939లో యూపీలోని ఇటావా జిల్లా సైఫయి గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆగ్రా వర్సిటీ పరిధిలోని బీఆర్ కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ అందుకున్నారు. అనంతరం కర్హైల్‌లో లెక్చరర్‌గానూ పనిచేశారు.
రెజ్లింగ్ పట్ల ఎంతో మక్కువ ప్రదర్శించే ములాయం.. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయ మల్ల యోధుడిగా ఎదిగారు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మాలతి దేవి కన్ను మూసిన తర్వాత, సాధనా యాదవ్‌ను పెళ్లి చేసుకున్నారు. ములాయం రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అఖిలేష్ యాదవ్, మొదటి భార్య కుమారుదు. రెండవ భార్య కుమారుడు ప్రతీక్ యాదవ్. ప్రతీక్ భార్య అపర్ణా యాదవ్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.
స్వతహాగా మల్ల విద్యలో పట్టున్న ములాయం రాజకీయాల్లోనూ మల్లయోధునిగా పేరు తెచ్చుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రేమతో నేతాజీగా పిలుచుకునే ములాయం 1960లలో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం దేశంలో తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎదిగారు. 1967లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కాలు పెట్టారు. ఆ తర్వాత రాజకీయాల్లో తన జైత్రయాత్రను కొనసాగించారు. మూడు పర్యాయాలు సీఎంగా, ఏడు సార్లు ఎంపీగా, ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని విశ్వాసం చూరగొన్నారు.
1996లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో 1996 నుంచి 1998 మధ్య దేశ రక్షణశాఖ మంత్రిగా సేవలందించారు. అనంతరం మూడు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. 1989 నుంచి 1991వరకు తొలిసారి సీఎంగా కొనసాగగా.. 1993 నుంచి 1995, చివరగా 2003 నుంచి 2007 వరకు యూపీ సీఎంగా సేవలందించారు. దేశంలో ప్రభుత్వాల ఏర్పాటులో గానీ, అధికార కూటమికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో గానీ ములాయం నిర్మాణాత్మక పాత్ర పోషించారు.
సోషలిస్టు నాయకుడు డాక్టర్ రాంమనోహర్ లోహియా సిద్ధాంతాలకు ఆకర్షితుడైన ములాయం చిన్న వయసులోనే రాజకీయాల వైపు ఆసక్తి కనబరిచారు. మధు లిమాయే, రామ్ సేవక్ యాదవ్, కర్పూరి ఠాకూర్, జనేశ్వర్ మిశ్రా, రాజ్ నారాయణ్ వంటి వ్యక్తులతో పరిచయం తర్వాత 15 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లో చేరారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్ పనితీరుతో ప్రేరణ పొందారు. కార్మికులు, రైతులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, విద్యార్థుల సంక్షేమం, హక్కుల రక్షణ కోరుతూ ములాయం అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలో 1962 నుంచి 1963 వరకు ఇటావా డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో అరెస్టయి జైలుకు వెళ్లిన ములాయం.. 19 నెలల పాటు నిర్బంధంలో ఉన్నారు. 1977లో తొలిసారి మంత్రి అయ్యారు. సహకార, పశుసంవర్దకశాఖ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1980లో లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడిగా అయ్యారు. ఈ పార్టీ తర్వాత జనతాదళ్‌లో భాగమైంది.
ఇక అక్కడి నుంచి జనతా పరివార్ లో భాగంగా అడుగులు వేస్తూ కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో అనేక పత్రాలు కీలక పదవులు చేపట్టారు. 1982లో యూపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన ఆయన.. 1985 దాకా ఆ పదవిలో కొనసాగారు. లోక్‌దళ్ పార్టీలో చీలిక ఏర్పడిన తర్వాత క్రాంతికారి మోర్చా పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 1990లో కేంద్రంలోని వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోవడంతో చంద్రశేఖర్ సారథ్యంలోని జనతాదళ్ (సోషలిస్టు) పార్టీలో ములాయం చేరారు.
కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో యూపీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 1991లో కాంగ్రెస్ తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో యూపీ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ములాయం సింగ్ పార్టీపై బీజేపీ నెగ్గింది. అనంతరం 1992లో ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. ములాయం సింగ్ యాదవ్ కు అన్ని పార్టీలలో మంచి మిత్రులున్నారు. అంతే కాదు తుది శ్వాస వరకు రాజకీయాలనే శ్వాశించిన ములాయం ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు.