అఖిలేశ్ కు మరో బాబాయి సపోర్ట్..
posted on Sep 15, 2016 @ 3:33PM
వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు ఒకపక్క పార్టీలన్నీ ఎలా గెలుపొందాలి.. అధికారం ఎలా చేపట్టాలని కసరత్తుల మీద కసరత్తులు చేస్తున్నారు. ఇవన్నీ అలా ఉంటే.. మరోపక్క ములాయం కుటుంబంలో మాత్రం రాజకీయ వేడి మొదలైంది. కుటుంబ రాజకీయాలు ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ఎప్పటి నుండో అఖిలేశ్ ప్రభుత్వంపై కాస్త అసంతృప్తిగా ఉన్న ములాయం.. ఇప్పుడు ఏకంగా అఖిలేశ్ పదవిపైనే వేటు వేశారు. మంత్రివర్గంలో ఉన్న బాబాయ్ శివపాల్ యాదవ్ కు ఉద్వాసన పలికిన తరువాత, ఆయన్ను శాంతింపజేసేందుకు అఖిలేష్ ను పార్టీ రాష్ట్రాధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించి.. ఆయనకు పార్టీ భాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో బాబాయి రాంగోపాల్ యాదవ్ అఖిలేష్ కు తన సపోర్టును ఇచ్చారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు అఖిలేష్ కు చెప్పకపోవడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. "ఓ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ, అతని అనుమతి తీసుకోకపోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుంది. ఎన్నికలు రానున్న వేళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వాటిని పంచుతానని చెప్పి గౌరవంగా అఖిలేష్ తో రాజీనామా చేయించి ఉండవచ్చు" అని ఆయన అన్నారు. జరిగిన ఘటనలన్నీ చిన్న చిన్నవేనని, సమస్యలన్నీ సర్దుకుంటాయని రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్న రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. మరి ఇంకెన్ని రాజకీయాలు బయటపడతాయో చూడండి.