టెలికం కంపెనీలపై ముఖేష్ అంబానీ ఆగ్రహం... చూస్తూ ఊరుకోం
posted on Sep 8, 2016 @ 11:54AM
ఉచిత సేవలు అందించడానికి మార్కెట్లోకి వచ్చిన రిలయన్న్ జియో సిమ్ కు ఆది నుండి కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఫ్రీ ఆఫర్ ఇచ్చిన వెంటనే ఈ సిమ్ కోసం పెద్దఎత్తున యువత రిలయన్స్ షోరూంల దగ్గర బారులు తీయగా.. సిమ్ కార్డుల కొరత ఏర్పడింది. దీంతో అందరికి టోకెన్ లు ఇచ్చి ఈనెల 15వ తేదీన ఇస్తామని చెప్పారు. అంతేనా సిమ్ కార్డు యాక్టివేషన్ లోనూ ప్రాబ్లమ్స్ తలెత్తాయి. ఇప్పుడు తాజాగా మరో సమస్య తలెత్తింది. అదేంటంటే.. రిలయన్స్ జియో నుంచి ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ తదితర టెలికం కంపెనీల వినియోగదారులకు కాల్స్ వెళ్లకపోవడం. సిమ్ కార్డ్ మార్కెట్లోకి వచ్చి దాదాపు ఐదు రోజుల గడిచింది. ఈ ఐదు రోజుల వ్యవధిలో దాదాపు 5 కోట్లకు జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు వెళ్లిన కాల్స్ కనెక్ట్ అవ్వడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ముఖేష్ అంబానీ టెలికం కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మార్కెట్లో నువ్వు ప్రముఖ స్థానంలో ఉన్నావు. (పేరును చెప్పకుండా ఎయిర్ టెల్ ను ఉద్దేశించి) ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నావు. ఒకటి లేదా రెండు సార్లు తప్పించుకోగలుగుతావేమో... మా ఉద్దేశంలో ఇంటర్ కనెక్ట్ వ్యవహారం ఓ చిన్న సమస్య. కొన్ని వారాల్లో పరిష్కృతమవుతుంది. అంతకుమించి చట్టాన్ని నువ్వు అతిక్రమించలేవు. ట్రాఫిక్ తో సంబంధం లేకుండా ఇంటర్ కనెక్ట్ కు మద్దతివ్వాల్సిందే. అదే లైసెన్స్ నిబంధనల్లో ఉంది" అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ సంస్థగా రిలయన్స్ జియో ప్రారంభమైందని, ఒక్క రూపాయి కూడా ఆదాయాన్ని కోరుకోకుండా తాము రూ. 1.5 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టామని, చట్ట వ్యతిరేకంగా, టెలికం లైైసెన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా టెల్కోలు ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పటికిప్పుడు జియో నుంచి రాబడులు రావాలని తాము కోరుకోవడం లేదని, కానీ దీర్ఘకాలంలో మంచి ఆదాయం, లాభాలు వస్తాయని మాత్రం నమ్ముతున్నామని ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు.