ముద్రగడ అడుగులు వైసీపీ వైపు...14న ముహూర్తం
posted on Mar 10, 2024 @ 3:18PM
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14న తాను వైసీపీలో చేరుతున్నానని ముద్రగడ స్వయంగా వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో తాను, తన కుమారుడు గిరి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నామని వివరించారు.
తాను పదవులు ఆశించి వైసీపీలోకి రావడం లేదని, సీఎం జగన్ విజయం కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ముద్రగడ స్పష్టం చేశారు. వైసీపీ నాయకత్వాన్ని ఎలాంటి పదవులు అడగలేదని అన్నారు.
కాగా, మార్చి 14న కిర్లంపూడి నుంచి తాడేపల్లికి భారీ ర్యాలీగా ముద్రగడ తరలిరానున్నట్టు తెలుస్తోంది.
ముద్రగడ పద్మనాభం వైసీపీ నుంచి పవన్ కల్యాణ్ పైన పోటీ చేస్తారని ప్రచారం సాగింది. పిఠాపురం నుంచి పోటీలో నిలుస్తారని భావించారు. అయితే, ముద్రగడ ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టత ఇచ్చారు. ముద్రగడ గతంలో కాకినాడ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేసారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటానని చెబుతూనే...ఎన్నికల్లో మాత్రం పోటీ చేయటం లేదని వెల్లడించారు. ఇక, గోదావరిలో ఈ సారి పవన్ కల్యాణ్ కాపు ఓట్ బ్యాంక్ తన వైపు తిప్పుకుంటారనే అంచనాలు ఉన్నాయి. దీంతో, ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరటం ద్వారా కాపు ఓట్ బ్యాంక్ పైన గురి పెట్టింది. ఇప్పటికే చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరారు. ఇక, ముద్రగడ వైసీపీలో చేరిన తరువాత గోదావరి రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ అధికారంలోకి వస్తే ముద్రగడను రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం.