మిసెస్ ప్లానెట్ విజేత ... మన బెజవాడ మల్లిక
posted on Jul 21, 2022 @ 10:38AM
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మా... అంటూ ఓ పాత సినిమాలో చెల్లెలి గురించి అన్న డప్పు కొడుతూ మరీ పాడి పరవశించిపోతాడు. ఆమెది కేవలం మామూలు అందం కాదు, శారీరక మానసిక సౌందర్యం కూడా లెక్కలోకి వస్తుంది. అసలు అందం అంటేనే లోకజ్ఞానంతో కూడిన అందం, అదే అసలు సౌంద ర్యం. పోతే అందం అనగానే మిల్కీ బ్యూటీ అనే భ్రమలు ఈరోజుల్లో అమ్మాయిలు వదులుకోవాలి. అందం అనేది వయసుతో పనిలేనిది. అమ్మలూ, అమ్మమ్మలూ అందంగానే ఉంటారు, వారిలో గొప్ప హుందాతనం ఉం టుంది. వారి ఆలోచన, మానవత్వపు విలువలు వెరసి వారి అందాన్ని ఎన్నింతలైనా పెంచుతుంటాయి.
అందాల పోటీ అనగానే అమ్మాయిలకే కాదు వివాహితులకూ నిర్వహిస్తున్నారు చాలా కాలం నుంచే. అయితే విదేశాల్లో జరిగే పోటీల్లోనూ భారతీయ సంతతికి చెందినవారు ఆ పోటీల్లో కిరీటం సాధించడం మనకు అందునా తెలుగువారికి మరింత గర్వం. ఇప్పుడు తాజాగా విజయవాడకు చెందిన దుర్గ శివ నాగ మల్లిక బిల్లుపాటి అనే మహిళ అంతర్జాతీయ అందాలపోటీలో పాల్గొన్నది. బర్గాస్ సమ్మర్ ఫెస్టివల్ అండ్ మిసెస్ ప్లానెట్ అంతర్జాతీయ అందాల పోటీలను బల్గేరియా దేశంలో జులై 6 నుంచి 15 వరకూ జరిగాయి.
వివాహితల విభాగంలో 60 మంది ఇతర దేశాల వారితో ఏడు రౌండ్ల తర్వాత విజేతగా నిలిచి మిసెస్ ప్లానె ట్ టైటిల్ సాధించింది. ఇక ఇప్పుడు తెలుగు మహిళలు, ముఖ్యంగా వివాహితలంతా ఎంతో గర్వపడ వచ్చు. తమకు ఇలాంటి పోటీల్లో విజేత ఉందని అందరికీ చెప్పుకుని ఆనందాన్ని పంచుకోవచ్చు. విజయవాడకు చెందిన మహిళ గెలచి తెలుగువారి ఖ్యాతి మరోసారి చాటింది.
గతంలో 2019లో మిసెస్ అమరావతి, 2020లో మిసెస్ ఆంధ్రప్రదేశ్, 2021 లో మిసెస్ ఇండియా టైటిల్స్ గెలుచుకున్న మల్లిక 2022 సంవత్సరానికి మిసెస్ ప్లానెట్ పోటీలో నెగ్గి కిరీటాన్ని స్వంతం చేసుకున్నారు. ఎంబిఏ చదివిన మల్లిక బిజినెస్ మ్రాన్ జితేంద్రను వివాహం చేసుకున్నారు. వీరికి 6 వతరగతి చదువు తున్ప ఓ కుమారుడు ఉన్నాడు. మల్లిక అందాలరాణి విజేతగా విజయవాడకు తిరిగి వచ్చారు. ఆమెకు ఘనస్వాగతం ఇవ్వడానికి మహిళలు తరలివచ్చారు.