నకిలీ బ్రాండ్లు, చీప్ లిక్కరే మందుబాబులకు గతి
posted on Mar 6, 2012 @ 2:01PM
లాభాలకోసం రూటు మార్చిన మద్యం సిండికెట్లు
హైదరాబాద్: ఎమ్మార్పి కన్నా ఎక్కువ రేట్లకు మద్యాన్ని అమ్మి కోట్ల రూపాయలు దోచుకున్న మద్యం వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు తమ రూటు మార్చారు.లాభాలు తగ్గకుండా ఉండేందుకు ఇప్పుడువారు మరోమారు సిండికేటై ఎక్కువ మార్జిన్ ఉండే ఊరు పేరు లేని బ్రాండ్లు, చీప్ లిక్కర్, నకిలీ మద్యం మాత్రమే విక్రయిస్తున్నారు. తక్కువ మార్జిన్ ఉండే ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని దాదాపు విక్రయించడం మానేశారు. దీంతో మద్యానికి బానిసలైన మందుబాబులు నకిలీ బ్రాండ్లు, చీప్ లిక్కర్ నే గత్యంతరం లేక తాగుతున్నారు. ఈ కొత్త వ్యూహం మళ్ళీ మద్యం సిండికెట్లకు కాసులు కురిపిస్తోంది. ఈ వ్యవహారాన్ని కూడా యధావిధిగానే రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాయల్ చాలెంజ్, ఎమ్ ఎమ్ హెచ్, సిగ్నెచర్, రాయల్ స్టాగ్, 5000 హెవార్ట్, కళ్యాణి, కింగ్ ఫిషర్, నాకౌట్ తదితర కంపెనీల మద్యాన్ని, బీరును అమ్మడం నిలిపివేశారు. ఈ చీప్ లిక్కర్ వల్ల మద్యపాన ప్రియుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఈ సిండికెట్లు ఎమ్మార్పికంటే అధిక ధరలకు మద్యాన్ని విక్రయించారు. ఇప్పుడు కల్తీ మద్యాన్ని ఎమ్మార్పి ధరలకు విక్రయిస్తూ ఆర్ధికంగా ప్రజలను దోచుకోవడమే కాకుండా వారి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఎప్పటిలాగే చేష్టలుడిగి చూస్తోంది.