కర్నూలు కేబుల్ వ్యాపారంలో మంత్రి టిజి వెంకటేష్
posted on Mar 6, 2012 @ 2:06PM
కర్నూలు: రాష్ట్రంలో పెద్ద వ్యాపారవేత్తల్లో రాష్ట్రమంత్రి టిజి వెంకటేష్ ఒకరు. తెలంగాణా ఉద్యమ సమయంలో సమైఖ్యాంధ్ర వాదాన్ని ధైర్యంగా భుజాన వేసుకున్నారు. టిజి వెంకటేష్, ఇది భాగానేవున్నా ఆయనగారు కర్నూల్ జిల్లాలో కేబుల్ వ్యాపారం చేస్తూ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో వ్యాపారమంతా టిజి వెంకటేష్ ఆయన కుటుంబం సభ్యులకు చెందినది. కర్నూల్ నగరంలో టిజి వెంకటేష్, ఎస్వీ మోహనరెడ్డి, కెఇ ప్రభాకర్ కేబుల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నగరాన్ని పలు ప్రాంతాలుగా వీరు విభజించుకున్నారు ఈ ముగ్గురి నిర్వహణలో కేబుల్ వ్యాపారం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వీరు చేసే ప్రసారాలు ఎంత చెత్తగా ఉన్నా ఖాతాదారులు మౌనంగా భరించాల్సిందే. రేట్లు ఎంత పెంచినా ఎదురు చెప్పకుండా ఇవ్వాల్సిందే. దీనికి తోడు పార్ట్ నర్ ల మధ్య వివాదాలు కూడా కేబుల్ వినియోగదారులకు అసౌకర్యం కలిగిస్తుంటాయి. సిటీ కేబుల్ పేరుతో వీరు ప్రసారాలు చేస్తుంటారు. అయితే ఇటీవల ఎస్వీ మోహనరెడ్డి, కెఇ ప్రభాకర్ వర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో హఠాత్తుగా సిటీ కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మహాలక్ష్మి డిజిటల్ కేబుల్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఏఏ చానెల్ ఎక్కడొస్తుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ప్రయత్నిస్తుండగా హఠాత్తుగా ఆ ఛానెల్స్ కూడా నిలిచిపోయి మరో చానెల్ ప్రసారాలు దర్శనమిచ్చాయి. దీనంతటికీ కారణం ఈ రెండువర్గాల మధ్య ఉన్న విభేదాలే. ఇది తెలుసుకున్న మంత్రి టిజి వెంకటేష్ రెండు వర్గాలను కూర్చోబెట్టి వివాదాన్ని పరిష్కరించినట్లు తెలిసింది.