కేసీఆర్ వదిలిన బాణమే షర్మిల! రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
posted on Feb 9, 2021 @ 6:28PM
వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో ప్రకంపనలు స్పష్టిస్తోంది. రాజకీయ పార్టీల్లోనూ కొత్త పార్టీపైనే చర్చ జరుగుతోంది. అయితే షర్మిల కొత్త పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వదిలిన బాణమే షర్మిల పార్టీ అన్నారు కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కేసీఆర్ షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి.
వైఎస్ కు తెలంగాణలో అభిమానులు ఉన్నారన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ పార్టీలోనే వైఎస్ సీఎం అయ్యారని చెప్పారు.వైఎస్ ఏ పథకం తెచ్చినా కాంగ్రెస్ నాయకుడుగానే చేశారని చెప్పారు. వైఎస్ అంటే తెలంగాణ సమాజానికి గౌరవం, అభిమానం ఉందన్న రేవంత్.. అంత మాత్రాన షర్మిల పార్టీ పెడితే ప్రజలు అంగీకరించరని తెలిపారు.తెలంగాణ బిడ్డలు ఏలుకోవడానికి రాష్ట్రం తెచ్చుకున్నాం కానీ... రాజన్న బిడ్డగా ఏలుకోవడానికి కాదంటూ హాట్ కామెంట్స్ చేశారు.రాజన్న బిడ్డగా సారె పెట్టి పంపుతా కానీ, పార్టీ పెడితే ప్రజలు ఆమోదించరన్నారు.కేసీఆర్ ఇక సీఎం అయ్యేది లేదని తేల్చి చెప్పారు.షర్మిల పార్టీపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ వ్యతిరేక ఓట్ల చీలిక తెచ్చేందుకు పార్టీ పెట్టిస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుట్ర నుంచి తెలంగాణ సమాజం అప్రమత్తం కావాలన్నారు రేవంత్ రెడ్డి.
షర్మిలకు తన అన్నతో పంచాయితీ ఉంటే అక్కడే చూసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. పులిచింతల, పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం పై షర్మిల వైఖరి చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ వద్దు... సమైక్యరాష్ట్రం ముద్దు నినదించారు కాబట్టి.. చనిపోయిన బిడ్డలకు ముందు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు. అన్నని కాదని మా తెలంగాణ పక్షాన నువ్వు నిలబడే చిత్తశుద్ధి ఉందా అని షర్మిలను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మన రాష్ట్రం మనం ఏలాలా... పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి ఏలాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. షర్మిల పార్టీకి ఇక్కడ మనుగడ ఉండదన్నారు. 1200 మంది బిడ్డల బలిదానాలను అవమానించే వాడే షర్మిలకు స్వాగతం పలుకుతాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.